Wednesday, 4 November 2026

*రైతుబంధు…రాబంధుల పాలు*

*•అసలు భూమి వేరు…రెవిన్యూ రికార్డుల్లో లెక్క వేరు!*
*•దొంగలెక్కలతో అడ్డంగా  రైతుబంధు సాయం  పొందుతున్న అక్రమార్కులు!!*
బయ్యారం,సెప్టెంబర్27(జనంసాక్షి):
వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం. ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2018 ప్రారంభించారు.
మొదట్లో 2018-19 సంవత్సరంలో ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకోసం రెండు విడతల్లో ప్రతి రైతుకు మొత్తం ఏడాదికి రూ. 8వేలను ప్రభుత్వం అందించారు. 2019-20 నుంచి పంట పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచి, రైతుకు ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు అందజేస్తున్నారు.అయితే కొందరు ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.భూములు లేవు… కానీ పట్టాలున్నాయి..సాగు లేదు.. కానీ రైతు బంధు సాయం దర్జాగా పొందుతున్నారు.రికార్డుల్లో భూమికీ అసలు ఉన్న భూమి లెక్కలకు పొంతన లేకున్నా లక్షల్లో రైతు బంధు నగదు కాజేస్తున్నారు.సర్కారు ఉద్యోగాలు చేస్తూ బోగస్ పట్టాలతో ప్రభుత్వాన్ని మోసం చేసే మహానుభావులూ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో పలు గ్రామాల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది.మండలంలోని కొందరు రైతులమనే వంకతో ఉన్నది 20గుంటల సాగు భూమి అయితే 2ఎకరాలుగా,1ఎకరంను 5 ఎకరాలుగా,5 ఎకరాలను 10-15 ఎకరాలుగా వారికి ఇష్టం వచ్చిన పద్దతిలో తప్పుడు లెక్కలతో అధికారిక లెక్కలు నమోదు చేశారంటే ఎంతటి మేధావులో అర్ధమవుతుంది.ఇదంతా ఏ అండా లేకుండా జరుగుతుందా!? అంటే దానికి సమాధానం భిన్నంగా ఉంది. లోకల్ నాయకులు, రాజకీయ అండ, స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని పరిచయాలతో ఉత్తుత్తి సర్వేలతో భోగస్ పట్టాలు పొంది రైతుబంధు సాయం సంవత్సరానికి ఏకంగా లక్షల్లో అడ్డంగా లబ్ది పొందుతున్నారు.ఇలా గత 4 సంవత్సరాలనుండి జరుగుతున్నా ఏ అధికారి దీనిపై సరైన పద్దతిలో చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు.ఆర్థికంగా పెట్టుబడి పెట్టలేని సన్నకారు రైతుల భరోసా కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం అక్రమార్కుల పాలిట సువర్ణవకాశం గా మారిపోయింది.అధికారిక ధరణి పోర్టల్ లో భూమి కి సంబందించిన వివరాలను నమోదు చేసే క్రమంలో నఖిలి పత్రాలను సదరు వ్యక్తులు కలిగి ఉన్న భూమి కంటే ఎక్కువగా ఉన్నట్టు తయారుచేసి వాటిని సంబంధిత అధికారులకు సమర్పించిన తరుణంలో అధికారులు నామమాత్రపు సర్వేలు నిర్వహించిన కారణంగా జరిగిన తప్పిదం వల్ల అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు.మరో కోణంలో రైతుబంధు పథకంలో పదుల ఎకరాల్లో భూములు కలిగినవారికి లక్షల్లో నగదు తమ ఖాతాలో జమ అవుతుంది. అయితే ఈ పథకంలో లబ్ధిదారులకు ఒక పరిధి అంటూ లేకుండా ఉండడం వల్ల బడా భూ స్వాములు అధిక మొత్తంలో లాభపడుతున్నారు.దోచుకున్నడికి దోచుకున్నంత తీరుగా లెక్కల్లో తప్పులు, పర్యవేక్షణ లోపం కారణంగా సామాన్యుడిపై భారం పడుతుంది.నఖిలి పట్టాదారులు ఇలా అడ్డదారుల్లో వెళ్లడం మూలాన ప్రభుత్వంపై అధిక భారం పడుతూనే ఉండగా, ఇదంతా పన్నుల రూపంలో సామాన్యుడిపై కుంపటిలా మారింది.ఈ పథకంలో గరిష్టం గా 5-10 ఎకరాలు కలిగిన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తించేలా చూడాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.ఇకనైనా అధికారులు,ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ పథకంలో అవకతవకలు పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.