Tuesday, 3 November 2026

రైతుల భూములతో రియల్‌ వ్యాపారమా..?

ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ  జగన్‌
హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి):  రైతుల భూములతో రియల్‌ వ్యాపారం చేస్తారా అని వైఎస్‌ జగన్‌ సూటిగా ప్రశ్నించారు. ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా జరిగాయి. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ రైతుల వియంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమైన అంశాలపై చర్చలు జరపకపోవడం శోచనీయమన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడే సమయంలో మైకులు కట్‌ చేయడం దారుణమన్న ఆయన.. విపక్ష సభ్యుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతు ఆత్మహత్యలు, కరువు, నీటి సమస్యలతో పాటు విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్‌ తదితర అంశాలపై చర్చించాలని జగన్‌ పట్టుబట్టారు. ఈ దశలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్‌.. లక్షల ఎకరాల భూములు దోచుకున్నారన్న మంత్రి అచ్చెంనాయుడు వ్యాఖ్యలతో సభలో గందరగోళం నెలకొంది. రాజధాని భూసవిూకరణ విషయంలో టిడిపి సభ్యలు అంతా అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంకుంటున్నారని జగన్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుపై   తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే మైకులు కట్‌ అవుతాయని, ప్రతిపక్ష నాయకుడిపై అవాకులు చవాకులు పేలితే అందుకు ప్రతిగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వటం లేదన్నారు. ఇటువంటి వివక్ష ఎక్కడా లేదని, గవర్నర్‌ ప్రసంగం అనంతరం అధికార పక్ష సభ్యులు రెండు గంటలపాటు మాట్లాడిందే మాట్లాడుతున్నారని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. నోరు తెరిస్తే అబద్ధాలు అని, చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ నేతలు కూడా అన్ని నేర్చుకున్నారన్నారు. సింగపూర్‌, జపాన్‌, అమెరికా మాదిరిగా రాజధాని కట్టండని తమకు ఎలాంటి అభ్యంతరం లేదని…అయితే బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కోవటం సరికాదన్నారు.ఆంధప్రదేశ్కు అన్యాయం జరుగుతుందని అసెంబ్లీలో అధికార పక్షం అంటుందని….విభజన విషయంలో కేంద్రం అన్యాయం చేసినప్పుడు ప్రభుత్వంలో టీడీపీ…ఎందుకు కొనసాగుతుందని వైఎస్‌ జగన్‌ ప్రశ్నలు సంధించారు. కేంద్ర వైఖరిని ఎండగడుతూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి పోరాడవచ్చు కదా అని ఆయన అన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *