Tuesday, 3 November 2026

రోడ్డు నిర్మాణ పనులలో నిర్లక్ష్యం – కొరవడిన అధికారుల పర్యవేక్షణ

మునగాల, మే30 (జనంసాక్షి): కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులతో జరుగుతున్న రోడ్డు పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణ కొరవడిన కారణంగా నిర్మిస్తున్న రోడ్డు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా కనబడుతుంది. మునగాల మండల కేంద్రం నుండి కీతవారిగూడెం వెళ్లే రోడ్డు సరిగా లేకపోవడంతో సుమారు 15 గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న రోడ్డు సమస్యను ప్రభుత్వం గుర్తించి రహదారి నిర్మాణానికి 20 కోట్లు నిధుల మంజూరు చేసింది. కాంట్రాక్టర్ పనులు ప్రారంభిచారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెటీరియల్‌ను ఉపయోగించడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణం జరుగుత్ను రోడ్డు పనుల సమయంలో అర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణే లేకుండా పోయింది. దీంతో గుత్తేదారులు ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారు. సరైన కాంక్రీట్‌ వాడకపోవడంతో తెల్లగా బూడిద బయటి పడిపోతుంది. దానిని కప్పిపుచ్చేందుకు ఆ వెను వెంటనే పైన రోడ్డు వేస్తున్నారు. ప్రాథమికంగా రోడ్డు బాటమ్‌ బెడ్‌ (40ఎంఎం) పెద్ద కంకర రాళ్లు, సిమెంట్‌ బాగా వేసిన తర్వాత బాగా వైబ్రేషన్‌చేసి రెండు రోజులపాటు బాగా క్యూరింగ్‌ చేయాల్సి ఉంది. అయితే ఆ పద్ధతిని ఎక్కడా పాటించడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబందిత అధికారులు రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి గుత్తేదారు అలాంటివి బోర్డులు ఏర్పాటు చేయలేదని పలువురు వాహనదారులు వెల్లడిస్తున్నారు. పగటి పూట పనులు నిర్వహిస్తున్నాడడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టుల విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రైతులే స్వంత ఖర్చుతో గునలు తెచ్చుకొని వేసుకున్నట్లు వెల్లడించారు.