Tuesday, 3 November 2026

పొంగులేటి పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు. – పిఎసిఎస్ మాజీ చైర్మన్ పోతిరెడ్డి.

 

బూర్గంపహాడ్ మే 30 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు సరికాదని బూర్గంపహాడ్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోడు యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు. దీంతో బిఆర్ఎస్ నాయకులు రోజురోజుకు పొంగిలేటికి పెరుగుతున్న జనాదరణను చూసి ఓర్వలేక తమ అక్కసు వెళ్లగకుతున్నారని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు ఓటమి భయం పట్టుకుందని అందుకే సహనం కోల్పోయి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని దీనిని పొంగిలేటి సైన్యంగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిన నేతలు మళ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మరోసారి ప్రజలను మోసగించేందుకు సిద్ధమయ్యారని అన్నారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా గుర్తుకురాని పోడు రైతులు ఇప్పుడు గుర్తుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటో ప్రజలే అర్థం చేసుకోవాలని అన్నారు. పినపాక నియోజకవర్గంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా రేగా కాంతారావు ఎన్ని డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారో చెప్పాలన్నారు. అదేవిధంగా గత శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హయాంలో ప్రతిపాదించిన పనులకు నేడు తుది మెరుగులు దిద్ది తామే సాధించినట్లుగా సామాజిక మాధ్యమాలలో గొప్పలు చెప్పుకుంటున్నారేతప్ప ప్రజలకు కొత్తగా ఒరిగిందేమీ లేదన్నారు. పినపాక నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా దోపిడి దౌర్జన్యాలు సాగుతున్నాయని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి, మొరంపల్లి బంజర ఉపసర్పంచ్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, లక్ష్మీపురం ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు పాలం లక్ష్మారెడ్డి, కాటం వెంకట్రామిరెడ్డి, తేజవత్ నరసింహ, కైపు బాలనాగిరెడ్డి, గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి, చిప్పా రాజు తదితరులు పాల్గొన్నారు.