– టీటీడీపీ అధ్యక్షులు ఎల్. రమణ
హైదరాబాద్, మార్చి29(జనంసాక్షి) : తెలంగాణలో జరుగుతోన్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 38ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్. రమణ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రశ్నించే గొంతులు చట్ట సభల్లో ఉండాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని గెలిపించిన ప్రతీ ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని రమణ తెలిపారు. టీఆర్‌ఎస్‌లో బిజినెస్ మెన్లకు, పారిశ్రామిక వేత్తలు, దోపిడీ దార్లకు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణలో నయా గడిలా పాలన నడుస్తోందని విమర్శించారు. 37ఏళ్లుగా ప్రజాజీవితంలో టీడీపీ ఉందని.. వ్యాపార పార్టీ అయిన టీఆర్‌ఎస్ దుకాణం బంద్ కావటం ఖాయమన్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో కవితను ఓడించాలని పిలుపునిచ్చారు. అప్పుడే సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు కనువిప్పు కలుగుతుందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఒక అడుగు వెనక్కి వేసినా.. భవిష్యత్ లో అడుగులన్ని ముందుకే వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో లాగా టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని రమణ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే మద్దతు




