వరంగల్ బ్యూరో మార్చి 19 (జనం సాక్షి)
వరంగల్ జిల్లాలో వడగండ్ల వాన అపార నష్టాన్ని మిగిల్చింది. వేలాది ఎకరాలలో వేసిన పంటలు వర్షం కారణంగా నిరుపయోగమయ్యాయి చేతికొచ్చిన పంట నేలపాలు కాగా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు మిగిలాయి. శనివారం అర్ధరాత్రి అకస్మాత్తుగా భారీ ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వాన భారీ నష్టాన్ని మిగిల్చింది జిల్లాలోని దాదాపు అన్ని మండలాలలో వేలాది ఎకరాలలో వేసిన మొక్కజొన్న మిర్చి వరి మొదలైన పంటలతో పాటు మామిడి తోట రైతులకు కూడా తీవ్ర నష్టాన్ని కలిగించింది. కొద్ది రోజులలో పంట చేతికి వస్తుందనంగా ఈ విషాదాన్ని కలిగించింది వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లోని గురజాల గ్రామంలో వేలాది ఎకరాల్లో వేసిన మొక్కజొన్న పంట వడగండ్ల వానకు విరిగి కింద పడిపోయింది. అదేవిధంగా ఇదే ప్రాంతంలో 50 విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి . అలాగే వందలాది ఇండ్లు కూలిపోయాయి. రేకుల ఇండ్లు పైకప్పు లేచిపోయాయి. అదే విధంగా 20 గొర్రెలు కూడా మృత్యువాత పడ్డాయి. దీంతో ఇటు రైతులు అటు గృహ వాసులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వం రైతులను ఆదుకొని నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని ఇదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బండారి మంజుల ప్రభుత్వాన్ని కోరారు. అన్నదాతను ఆదుకుంటేనే రాష్ట్రం దేశం అభివృద్ధిలోకి వస్తుందని ఆమె పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలోని నర్సంపేట డివిజనల్ కాకుండా వర్ధన్నపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో కూడా కోట్లాది రూపాయల పంట నష్టం జరిగింది. అదేవిధంగా కూరగాయలు పండ్లతోటలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. అంతేకాకుండా చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలు కూలి ఇండ్లు కూలిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ప్రజాపతినిధులు అధికారులు వెంటనే స్పందించి నష్టపరిహారాన్ని అందించడంతోపాటు అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




