నాగర్ కర్నూల్ ఆర్సీ మే 16(జనంసాక్షి):కన్నబిడ్డల ఆదరణకు ప్రేమ ఆప్యాయతలకు దూరమై అనాధ శరణాలయంలో బ్రతుకులు వెలదీస్తున్న వృద్ధుల హక్కులకు భంగం కలగకుండా రక్షణ కల్పించేందుకు సహకరిస్తామని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్,జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రాజేష్ బాబు పేర్కొన్నారు.మంగళవారం బిజినపల్లి మండల శివారులోని ప్రశాంతి నిలయం అయిన వృద్ధ ఆశ్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో వయోవృద్ధులకు తమ హక్కులు,పరిరక్షణ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కుటుంబ యజమాని అయిన వ్యక్తి తన కుటుంబం అభివృద్ధి కోసం పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని సర్వస్వాన్ని ధారపోసి అభివృద్ధి చేస్తాడు.అయితే వ్యక్తి చివరి రోజులలో తాము కనీ పెంచిన పిల్లల నుండి ప్రేమ ఆప్యాయతలకు నోచుకోకుండా,నిరాదరణకు గురై వృద్ధ ఆశ్రమాలను ఆశ్రయించడం మనసును బాధ కలిగించే విషయమని అన్నారు.దీనికోసం తమకు ఎలాంటి రక్షణ కావాలన్నా న్యాయపరంగా సహకారం అందిస్తమని అన్నారు.మీకు మీ వారి దగ్గరికి పోవాలని అనుకుంటే న్యాయ పరిధిలో తగిన ఏర్పాట్లు చేస్తామని అన్నారు.కొల్లాపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలికి పెన్షన్ విషయంలో తన బొటనవేలు ను కంప్యూటర్ గుర్తించలేని సమస్యతో పెన్షన్ ఇవ్వడంలేదని,కాబట్టి తనకు పెన్షన్ ఇప్పించాలని న్యాయమూర్తిని కోరారు.దీనికి స్పందించిన న్యాయమూర్తి వృద్ధురాలు బ్యాంకు వివరాలు,ఆధార్ నెంబరు వివరాలు తీసుకున్నారు.ఆమెకు పెన్షన్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.మరో మహిళ తన కూతురు ఎక్కడుందో తెలియదని తన కూతురిని చూపించాలని న్యాయమూర్తిని వేడుకున్నారు స్పందించిన న్యాయమూర్తి తన కూతురు ఎక్కడున్నా సమాచారం సేకరించి ఆశ్రమానికి తీసుకువచ్చి చూపిస్తామని హామీ ఇచ్చారు.మరో వృద్ధుడు లేచి
ముసలి వయసులో ఒకపక్క రోగాలు మరొక పక్క ఎవరూ లేరన్న బాధ మరింత కృంగదీస్తుందని సొంత వాళ్ళ దగ్గర ఉంటే మనవళ్లు,మనవరాళ్లతో ఆడుకుంటుంటే వచ్చిన రోగం కూడా పెద్దగా భావించదని అక్కడ వృద్ధులు న్యాయమూర్తికి చెప్పారు.ఆరోగ్యపరమైన సమస్యలు పరిష్కరించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సహకారం తీసుకొని వైద్య సేవలు అందిస్తామని న్యాయమూర్తి చెప్పారు.అనంతరం న్యాయమూర్తులు వృద్ధులకు పళ్ళ పంపిణీ చేశారు.వృద్ధాశ్రమంలో నీ వృద్ధుల పడకగదులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి,జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ జి.సబిత,డిస్టిక్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.మధుసూదన్ రావు,డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎ.సి.పి.శ్రీరామ్ ఆర్య,సూపరింటెండెంట్ దేవిక,సీనియర్ న్యాయవాది బాబు పియర్స్,ఆశ్రమ నిర్వాహకురాలు,న్యాయవాది వి.రాంబాబు,కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.




