జనంసాక్షి , మంథని : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ అన్నారు. లారీల కొరత దృష్ట్యా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్టీఎ, పోలీసు, రెవెన్యూ శాఖల సహకారంతో మంథని పాత పెట్రోల్ బంక్ సమీపంలో రహదారి గుండా వచ్చిపోయే లారీలను ఆపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ మాట్లాడుతూ, రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిరంతరం పంటలకు సాగునీరు అందించడంతో పంటలు అధికంగా సాగు జరిగి పంట దిగుబడి వచ్చిందని అన్నారు. లారీల కొరత ఏర్పడిన దృష్ట్యా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, హమాలీలు, మిల్లర్లు, లారీ కాంట్రాక్టర్ల సహకారం తీసుకొని రైతు పండించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున రైస్ మిల్లులకు వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు త్వరితగతిన దిగుమతి చేసుకుని సహకరించాలని కోరారు. హమాలీలు కూడా కొంత శ్రమకోర్చి రైతుల ధాన్యాన్ని వెనువెంటనే తూకం వేసి లారీల్లో లోడింగ్ చేయాలని కోరారు. రైస్ మిల్లుల్లో స్థలం కొరత ఉన్నందున వెంకటాపూర్ పరిసర గ్రామాల ధాన్యాన్ని వెంకటాపూర్ లో గల గోదాంలో, మంథనిలో కూడా మిని గోదాం ఉంది కాబట్టి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు నిల్వ చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని అన్నారు. మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాతావరణం అనుకూలించని పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో రైతులకు అన్ని రకాలుగా తాము అండగా ఉంటామని తెలిపారు. అకాల వర్షాలు, లారీల కొరత, రైస్ మిల్లర్లు అనుసరిస్తున్న విధానాల వల్ల కలుగుతున్న ఇబ్బందుల ప్రభావం రైతుల మీద పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకనుగుణంగా ధాన్యం తరలింపుకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సహకార సంఘం పాలకవర్గ సభ్యులు, సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించి అన్నదాతకు ఆసరాగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బండి ప్రకాష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, సంఘ డైరెక్టర్లు ఆకుల రాజబాపు, కొత్త శ్రీనివాస్, నాయకులు తగరం శంకర్ లాల్, ఆర్ఐ రాజిరెడ్డి, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, పోలీసు, రెవెన్యూ అధికారులు, ప్యాడీ సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.
వరి ధాన్యం తరలింపునకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం – మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ




