వర్షాలతో చెరువులకు జలకళ
భూగర్భ జలాలుల పెరిగాయన్న మంత్రి
కరీంనగర్,జూలై30(జనంసాక్షి): వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అలాగే భూగర్భ జలాలలు పెరుగు తున్నాయని అన్నారు. తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తితో చెరువుల పునరుద్దరణ,ప్రాజెక్టుల నిర్మాణం
చేపట్టడంతో మంచి ఫలితాలు వస్తున్నాయిని తెలిపారు. ప్రాజెక్టుల ఏర్పాటుతో కరువు ప్రాంతాల్లోని భూములు బంగారు మాగాణులుగా మారుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంతో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. కరువు ప్రాంతాలను కూడా బంగారు మాగాణులుగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబాటుకు గురైన తెలంగాణలో రైతాంగం బాగుండి, రాష్ట్రమంతా సస్యశ్యామలంతో ఉండాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రాజెక్టులు కడితే దశాబ్దాల పాటు సాగేవని… తెలంగాణ ప్రభుత్వం అలా కాదని, ప్రాజెక్టులు పూర్తిచేసి సాగు, తాగునీరు అందజేసేందుకు కృషిచేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు పోచంపాడ్ ప్రాజెక్టును కట్టేందుకు 37 సంవత్సరాల సమయం తీసుకున్నారని, ఇప్పడు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి మూడున్నర సంవత్సరాల్లో పూర్తి చేసిందన్నారు. వర్షాల కారణంగా ప్రాజెక్టులు,చెరువులకు జలకళ వచ్చిందన్నారు. కాళేశ్వరం ద్వారా రాష్ట్రంలో మొత్తం 37 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. రాష్ట్రంలోని రైతాంగ సంక్షేమానికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించడం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని కాలం వెల్లదీశారని, స్వరాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంత ఖర్చయినా పూర్తి చేసేందుకు వెనుకాడడం లేదన్నారు.