వర్షాలతో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

ఓపెన్‌ కాస్టుల్లో తీవ్ర ఆటంకం

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణి సంస్థ ఓపెన్‌ కాస్టుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదిలాబాద్‌,రామగుండం, కొత్తగూడెం,మణుగూరుల్లో ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మణుగూరు ఓసీ గనుల్లోని క్వారీల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి పూర్తిగా ఆటంకం ఏర్పడింది. ప్రతి రోజు 21,600 టన్నుల బొగ్గు తీయాల్సి ఉండగా ఆదివారం బొగ్గు ఉత్పత్తికి,వెలికితీతకు పూర్తిగా ఆటంకం ఏర్పడింది. వర్షం వలన అంతర్గత రోడ్లన్ని బురదమయం అవడంతో ఎక్కడి యంత్రాలు అక్కడే నిలిచిపోయాయి. వర్షపు నీటిని పంపుల ద్వారా బయటికి పంపుతున్నట్లు ఏరియా అధికారులు తెలిపారు. గౌతంఖని ఓపెన్‌కాస్టు నిర్దేశిరచిన పదివేల టన్నులకు గాను జేవీఆర్‌ ఓసీలో 20 వేల టన్నులకుగాను బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 60వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.రోజుకు మూడు షిప్టులు కలిపి 9 వేల టన్నుల వరకు ఉత్పత్తి జరగాల్సింది. వర్షాలకు కోయగూడెం ఓసీ గనిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనిలో నుంచి వరద నీటిని పూర్తి తోడివేయడానికి సుమారు 10 రోజులు పట్టే అవకాశం ఉందని వివరించారు. మరో బెంచ్‌ నుంచి మూడు, నాలుగు రోజుల్లో బొగ్గు ఉత్పత్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.