Friday, 6 November 2026

విజేత డిగ్రీ కళాశాలలో

విజేత డిగ్రీ కళాశాలలో
ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, డ్రగ్స్ వాడకంపై సెమినార్
పాల్గొన్న 1వ పట్టణ ఎస్సై శీను నాయక్
మిర్యాలగూడ, జనం సాక్షి.
కళాశాలల్లో ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, మత్తు పదార్థాల వాడకాలు సరదా కోసంగా ప్రారంభించి వ్యసనాలకు బానిసై చివరకు జైలు పాలు అవుతారని ఒకటో పట్టణ ఎస్ఐ శ్రీను నాయక్ అన్నారు. బుధవారం స్థానిక విజేత పీజీ అండ్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, మత్తు పదార్థాల వాడకం పట్ల నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కళాశాల దశ నుండి ప్రారంభమయ్యే ఈవ్ టీజింగ్ ర్యాగింగ్ మత్తు పదార్థాల వాడకాలు సరదాగా అనిపించినప్పటికీ అంతిమంగా జీవితాలు నాశనం అవుతాయని, వాటి పట్ల యువత జాగ్రత్తగా మెలగాలని, చెడు సావాసాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. విద్యార్థులపై వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వారిని చదివిస్తున్నారని వారి ఆశలను నిలబెట్టేలా విద్యార్థులు ఎదగాలని అన్నారు. కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులు సోదర భావంతో కలిసిమెలిసి విద్యాభ్యాసం చేసి భవిష్యత్తులో రాణించాలన్నారు. సెల్ ఫోన్ ల వాడకం అధికమవడం వల్ల మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందని, ఈ విషయాలను విద్యార్థిని విద్యార్థులు గ్రహించాలని కోరారు. సరైన అవగాహన లేకపోవడం, వాట్సప్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ ల వాడకంపై, హనీ ట్రాప్, లోన్ యాప్ ల బారిన పడవద్దు అని సూచించారు. సైబర్ క్రైమ్ ల పట్ల కూడా విద్యార్థిని విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని అలాంటి వాటికి దూరం గా ఉండాలని వివరించారు.ఏదైనా సమస్య ఉంటే పెద్దవాళ్లకు చెప్పి సలహా తీసుకుని జాగ్రత్త పడాలన్నారు.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ తెడ్ల ధనుంజయ.పారా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ. లెక్చరర్లు రామ్ రెడ్డి, సునీత, జ్యోతి, దశరథ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.