హైదరాబాద్ : ఈ బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ. 11,216 కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. చాలా ఏళ్లుగా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన బ్లాక్ గ్రాంట్లు ఏ మాత్రం పెంపుదలకు నోచుకోకుండా వదలివేయబడ్డయాని గుర్తు చేశారు. ఎంతో గుర్తింపు ఉన్న ఉస్మానియా వర్సిటీ విదేశఋ విద్యార్థులను ఎంతగానో ఆకర్షిస్తున్నప్పటికీ కూడా గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓయూను తీవ్రంగా నిర్లక్ష్యం చేయడం జరిగిందని చెప్పారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం చొరవ చూపి.. అక్కడ మంచి పరిపాలనను నెలకొల్పడమే కాకుండా, తగిన రీతిన బ్లాక్ గ్రాంట్లు పెంచుటకు చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే ఓయూకు 238 కోట్లు కేటాయించామని తెలిపారు.
కొత్తగా ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశు వైద్య విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మన్ ఉద్యానవన విశ్వవిద్యాలయాలతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తూ రూ. 261 కోట్లు ప్రతిపాదించామని చెప్పారు. పెరుగుతున్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చడం కోసం విద్యా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి, చరిత్ర, భాషలు ప్రతిబింబించే విధంగా పాఠశాల పాఠ్య ప్రణాళికల్ని మార్చడానికి సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి సూచనల మేరకు ఉపాధ్యాయ విద్య కార్యక్రమంలో భాగంగా కొత్త డిప్లామా కోర్సులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కేజీ టూ పీజీ పథకాన్ని పూర్తి సమగ్ర పరిశీలన, పరిశోధన తర్వాత అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నామని తేల్చిచెప్పారు. ఇందుకు సంబంధించి అవసరమైన మేథోమథనం వివిధ స్థాయిల్లో జరుగుతుందని పేర్కొన్నారు. ఒక రూపం వచ్చిన తర్వాత ఈ ప్రతిష్టాత్మక పథకం ప్రారంభమవుతుందన్నారు.





