విద్య టిఆర్ఎస్ ది – విధ్వంసం బిజెపి ది

33 గురుకులాలు 15 డిగ్రీ కాలేజీలు మంజూరు

* బీసీ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యం

* వేడి నీటి కోసం 85 కోట్లు

* రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు టీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తుంటే బిజెపి మాత్రం విద్వేషాలు రగిల్చి విధ్వంసం సృష్టిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
గత 70 సంవత్సరాల సమైక్య పాలనలో వెనుకబడిన కులాల వారికి విద్య నందించలేదని, బీసీ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 33 గురుకులాలు 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. గురువారం స్థానిక శ్వేత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలకు
విద్యను అందించాలనే ఆలోచన రాలేదు అన్నారు.
దీంతో వెనకబడిన కులాలకు చెందిన విద్యార్థులు చదువుకోలేక విద్యలో వెనక్కి నెట్టివేయబడ్డారు అని పేర్కొన్నారు.
ప్రైవేట్ స్కూళ్లలో వేలాది రూపాయల ఫీజులు కట్టలేక విద్యకు దూరమయ్యారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్య గొప్ప ఆస్తి అని భావించిన సీఎం కేసీఆర్ స్వయంపాలనలో విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టిని సారించారు.
గత 70 సంవత్సరాల సమైక్య పాలనలో తెలంగాణలో కేవలం 19 గురుకులాలు 7500 మంది విద్యార్థులకు విద్యను అందించేవి అన్నారు.
స్వయం పాలనలో సీఎం కేసీఆర్ 261 గురుకులాలను ఏర్పాటు చేసి లక్షా 52,440 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం అభినందనీయమన్నారు.
బీసీ గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇంగ్లీషులో అద్భుతంగా మాట్లాడుతున్నారు. అని సంతోషం వ్యక్తం చేశారు తమ పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడడానికి చూసిన తల్లిదండ్రులు మురిసిపోతున్నారు అని తెలిపారు.
బీసీ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం అదనంగా మరో 33 గురుకులాలతో పాటు మరో 15 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
డిగ్రీ కాలేజీల్లో ఈ సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున గురుకులాలు డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్న ఘనత కేవలం తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది అన్నారు.
స్వయం పాలనలో వెనుకబడిన కులాల విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 310 విద్యాలయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు అల్లకల్లోలం సృష్టించి విషం చిమ్ముతూ విద్వేషాలు పెంచి పోషిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం నాణ్యమైన విద్యను అందిస్తుంది అన్నారు.
నూతనంగా కరీంనగర్ జిల్లాకు ఒక బీసీ గురుకుల పాఠశాల తో పాటు ఒక డిగ్రీ కాలేజ్ కేటాయించినట్లు ప్రకటించారు.
బీసీ గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు చలికాలంలో చన్నీటి స్నానంతో ఇబ్బందులు పడకుండా 85 కోట్లతో అన్ని గురుకులాల్లో వేడినీటినందిస్తాం.
బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
డిగ్రీ కాలేజీల్లో డిమాండ్ ఉన్న కోర్సులోనే అందుబాటులోకి తీసుకు వస్తున్నాం అన్నారు.
అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమిస్తాం అని తెలిపారు
కరీంనగర్ లోని కేబుల్ బ్రిడ్జి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రారంభంతోపాటు టిటిడి టెంపుల్ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.
కొత్తపల్లి సీడ్స్ కంపెనీకి సంబంధించిన 25 ఎకరాల స్థలంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కార్పొరేటర్లు, టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.