నెక్కొండ: మండల కేంద్రానికి వచ్చిన మంత్రి హరీష్‌రావుకు భూక్య నితిన్ అనే విద్యార్థి వినతి పత్రాన్ని అందించేందుకు రాగా పోలీసులు అడ్డుకోవడంతో గట్టిగా విలపించాడు. ఇది చూసిన మంత్రి, బాలుడిని పిలిపించుకుని బాధను విన్నారు. తనది పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామం అని, తల్లి అనారోగ్యంతో మృతి చెందినట్లు నితిన్ తెలిపాడు. తండ్రి రాములు పట్టించుకోవడంలేదని నెక్కొండలోని ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకుని డబ్బులు లేక చదువును మధ్యలో ఆపినట్లు రోదిస్తూ చెప్పాడు. తనకు చదువుకోవాలని ఉందని మంత్రిని వేడుకున్నాడు. దీంతో స్పందించిన హరీష్‌రావు విద్యార్ధి చదువుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పక్కనే ఉన్న నెక్కొండకు చెందిన పారిశ్రామిక వేత్త రామడుగు రాందేవ్ విద్యార్ధి చదువు ఖర్చులను తాను భరిస్తానని ప్రకటించారు.నెక్కొండ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరిచేందుకు గాను దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, ముఖ్యమంత్రి పీఆర్వో గటిక విజయ్‌కుమార్ నెక్కొండ అభివృద్ధిలో వెనుకబడిన విషయాన్ని పలు మార్లు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా నెక్కొండను దతత్త తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే మండలంలోని నాగారం, చిన్నకోర్పోలు గ్రామాల్లోని వట్టివాగులపై చెక్ డ్యామ్‌తో కూడిన బ్రిడ్జీని నిర్మించేందుకు నిధులను మంజూరు చేస్తామన్నారు. పనికర గ్రామంలో లిఫ్టు ఇరిగేష్ ఏర్పాటు చేయాల్సిందిగా గ్రామస్థులు విజ్ఞప్తి చేయగా అందుకు మంత్రి అంగీకరించారు.నెక్కొండకు చెందిన పారిశ్రామిక వేత్త రామడుగు రాందేవ్ మిషన్ కాకతీయకు రూ.12 లక్షల విరాళం అందిస్తానని మంత్రుల సమక్షంలో ప్రకటించారు. అలాగే స్థానిక రామాలయం అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేస్తానని, తన సొంత స్థలంలో కల్యాణ మండపం, కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామన్నారు. నెక్కొండలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నిధులను అందిస్తానని చెప్పారు.




