శ్రీరాంసాగర్‌ నీటిని విడుదల చేయాలి

కరీంనగర్‌, అక్టోబర్‌ 29: వ్యవసాయానికి నీటి విడుదల చేయాలంటూ పెద్ద కాల్వ గ్రామ రైతులు గోదావరిఖని- కరీంనగర్‌ రాజీవ్‌ రహదారిపై సోమవారం నాడు రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని, మొక్కజొన్న, పత్తి పంటలకు నీరులేక పూర్తిగా ఎండిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్‌ఎస్పి నీటిని రామగుండం, వరంగల్‌ ప్రాంతాలకు తరలిస్తున్నారని, అలాగే పెద్ద కాల్వ ప్రాంత పొలాలకు కూడా విడుదల చేస్తే పంటలు చేతికి వస్తాయని రైతులు వెలిబుచ్చారు. లేనిచో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వస్తుందని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు పూర్తిగా నష్టపోయిన రైతులకు నేటి వరకు నష్టపరిహారం అందించాలేదని, వెంటనే పరిహారం చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. నీటిని విడుదల చేయకపోతే ఓరాటం ఉధృతం చేస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.