Wednesday, 4 November 2026

సత్యం కేసు తుది తీర్పు వాయిదా

  హైదరాబాద్:  సత్యం కుంభకోణం కేసు తుది తీర్పు వాయిదా పడింది. ఏప్రిల్ 9న తుదితీర్పు ప్రకటిస్తామని నాంపల్లి ప్రత్యేక కోర్టు వెల్లడించింది. కోర్టుకు ప్రధాన నిందితుడు రామలింగరాజుతో సహా ఇతర నిందితులు హాజరయ్యారు. ఈ నెల 9వ తేదీన తీర్పు వెల్లడిస్తామని గతేడాది డిసెంబర్ 23న జరిగిన విచారణ సమయంలో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి ఆరేండ్ల కాలంలో కోర్టు 3000 పైగా డాక్యుమెంట్లు, 226 మంది సాక్షులను విచారించింది.

ఎలాంటి రాబడి లేకపోయినప్పటికీ ఖాతాల్లో మాత్రం కంపెనీ లాభాల బాటలో నడుస్తున్నదని దురుద్దేశపూర్వకంగా సత్యం కంప్యూటర్ సర్వీస్ యాజమాన్యం ప్రకటించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణాన్ని 2009, జనవరి 7న సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజే స్వయంగా బయటపెట్టారు.

ఫిబ్రవరి 2009 నుంచి సీబీఐ ఈ కేసును విచారిస్తున్నది. దేశంలో ఇప్పటివరకిదే అతిపెద్ద అకౌంటింగ్ కుంభకోణం. ఈ స్కాంతో సత్యం షేర్ హోల్డర్లకు రూ.14 వేల కోట్ల మేర నష్టం జరిగిందని దర్యాప్తులో సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో రామలింగరాజుతోపాటు మొత్తం 9 మంది ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో ఆయన సోదరుడు, సత్యం మాజీ ఎండీ రామరాజు, మాజీ సీఎఫ్వో వడ్లమాని శ్రీనివాస్, పీడబ్ల్యూసీ ఆడిటర్లు గోపాలకృష్ణన్, టీ శ్రీనివాస్, రామలింగరాజు మరో సోదరుడు బీ సూర్యనారాయణ రాజు, జీ రామకృష్ణ, డీ వెంకటపతిరాజు, సీహెచ్ శ్రీశైలం, సత్యం అంతర్గత ఆడిటర్ వీఎస్ ప్రభాకర్ గుప్తా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *