నేడు సద్దుల బతుకమ్మ అంటూ విద్వత్సభ నిర్ణయం
గురువారమే పెద్ద బతుకమ్మ అంటున్న మరికొందరు
అయోమయంలో తెలంగాణ ప్రజలు
హైదరాబాద్,అక్టోబర్12 ( జనం సాక్షి ) : సద్దుల బుతకమ్మ నిర్వహణపై మరోమారు సందేహాలు బయలుదేరాయి. బుధవారమే సద్దుల బతుకమ్మ జరుపుకోవాలంటూ ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు గురువారమే అంటూ మరికొందరు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఏది నిజమో తెలియక ప్రజలు అయోమయంలో పడ్డారు. తెలంగాణ విద్వత్సభ విస్తృతంగా చర్చించి తీసుకొన్న నిర్ణయం మేరకు ఈ నెల 13నే సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని పండితులు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 13వ తేదీన సద్దుల బతుకమ్మ అని ఖరారు చేసింది. కొందరు సిద్దాంతులు మాత్రం బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకంగా శాస్త్రాలలో ఎక్కడా పేర్కొన్నందున కచ్చితంగా తేదీలు చెప్పలేమని అంటున్నారు. ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకునే సంప్రదాయం ఉన్నదన్నారు. బతుకమ్మను వేములవాడలో 7 రోజులు, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో కొన్నిచోట్ల 13 రోజులు అడతారు. ఎక్కువమంది పండితుల అభిప్రాయం ప్రకారం 13న సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని హైదరాబాద్కు చెందిన కమలాకర సిద్దాంతి వెల్లడిరచారు. బతుకమ్మ పితృ అమావాస్యరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై ఆయా ప్రాంతాల్లో స్థానిక ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం 5, 7, 9 రోజులు జరుపు కొంటారు. 13న సద్దుల బతుకమ్మను జరుపుకోవాలని విద్వత్సభ ఇప్పటికే నిర్ణయించిందని వరంగల్ భద్రకాళి దేవస్థానం సిద్దాంతి అనంత మల్లయ్య శర్మ సిద్దాంతి అభిప్రాయ పడ్డారు. బతుకమ్మ పండుగ ఈ నెల 6 ప్రారంభమైంది. 14న సద్దుల బతుకమ్మ పండుగ ఉంటుంది. తేదీ విషయంలో ఎలాంటి సందేహం లేదని తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు.
యాదాద్రి దేవస్థానం సిద్దాంతి కృష్ణమాచార్య పంచాంగం ప్రకారం అక్టోబర్ 14 న సద్దుల బతుకమ్మ, 15న దసరా జరుపుకోవాలన్నారు. విద్వత్ సభలో దుర్గాష్టమిరోజున జరుపుకోవాలని నిర్ణయించినప్పటికీ, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం ఉన్నందున దీనికి స్పష్టంగా ఫలానా రోజే జరుపుకోవాలని చెప్పలేం. స్థానిక సంప్రదాయాల ప్రకారం జరుపుకోవడమే ఉత్తమం అని సెలవిచ్చారు.
సద్దుల బతుకమ్మపై సర్వత్రా సందేహాలు




