పెద్ద నోట్ల రద్దువల్ల సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను పార్లమెంటు దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమాధానాలను రాబట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాజ్యసభ, లోక్‌సభలోని టీఆర్‌ఎస్ ఎంపీలను ఆదేశించినట్లు తెలిసింది. పాత నోట్ల రద్దు విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారని సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమైన నేపథ్యంలో పెద్దనోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్ర్తాలతో సన్నద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో సభ జరుగకుండా చేసేందుకు కొన్ని పార్టీలు వేసే ఎత్తుగడలకు తలొగ్గవద్దని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎంపీలకు సూచించారని తెలిసింది. ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చ జరుగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన కేసీఆర్.. అసలు విషయాన్ని వదిలేసి, సమస్యను పక్కదారి పట్టించేందుకు ఇతర పార్టీలు చేసే ప్రయత్నాలకు సహకరించవద్దని పార్టీ ఎంపీలను కోరారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ప్రధాని మాట్లాడిన తర్వాత నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించి.. క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఏం జరుగుతున్నదీ వివరించాలని పార్టీ ఎంపీలను సీఎం కోరారని తెలిసింది.
సభను ఆపే ప్రయత్నం చేయకండి




