మౌలిక వసతుల కొరత.. సమస్యల లేమితో కొట్టుమిట్టాడుతున్న సర్కార్ దవాఖానలకు వైద్యం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు కార్పొరేట్ తరహా వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఏరియా ఆసుపత్రుల్లో ఐసియూలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐసీయూల ఏర్పాటు సాధ్యాసాధ్యాల కోసం ఓ ఉన్నత స్థాయి కమిటీ వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎమ్ఈ ఛైర్మన్‌గా నలుగురు వైద్య అధికారులతో కమిటీ వేసిన ప్రభుత్వం.. 45 రోజుల్లో డిటెయిల్డ్ రిపోర్టును అందించాలని ఆదేశించింది.
కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లో వీలైనంత తొందరగా ఐసీయూలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 1.70 కోట్లతో 20 పడకల ఐసీయూ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. కరీంనగర్ జిల్లాలో రెండున్నర కోట్లతో 30 పడకల ఐసియూను ఏర్పాటు చేయనుంది. ఏడాది లోగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఆసుపత్రుల్లో ఐసియూ యూనిట్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.




