Wednesday, 4 November 2026

రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు

xp57q52lతమది రైతు సంక్షేమ ప్రభుత్వమని మంత్రులు తేల్చిచెప్పారు. రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. రైతు ఆత్మ హత్యలపై సీమాంధ్ర మీడియా విషప్రచారం చేస్తోందనిఆయన మండిపడ్డారు. చందంపేట మండలం నేరేడుగొమ్ములో పర్యటించిన ఆయన.. గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు రైతులకు రుణమాఫీ చేశామన్నారు. రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారు. రైతులు మనోధైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.

రైతు శ్రేయస్సుకు వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. రైతుల్లో ధైర్యం నింపడం సామాజిక బాధ్యతని.. ఈ పనిలో పాలుపంచుకునేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలన్నారు. పత్రికా యాజమాన్యాలు, జర్నలిస్టులు కూడా ఈ విషయంలో సహకరించి.. మంచి సూచనలు ఇవ్వాలని కోరారు. గత పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగంపై శ్రద్ధ చూపలేదని హరీష్రావు మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులను పెండింగ్లో ఉంచడంతోనే.. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయంలో షబ్బీర్ అలీ, ఉత్తమ్కుమార్ రెడ్డి, జానారెడ్డి మంత్రులుగా ఉండి తెలంగాణకు చేసిందేంటనీ ప్రశ్నించారు. నల్లారి కిరణ్కుమార్ రెడ్డి పంట నష్టంపై ఆంధ్రాకు పరిహారం ఇచ్చి.. తెలంగాణకు మొండి చెయ్యి చూపిస్తే అప్పుడు మాట్లాడని నేతలు ఇప్పుడెందుకు ఎగిరెగిరి పడుతున్నారన్నారు. అటు ఆత్మహత్యలపై టీడీపీ నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని అన్నారు హరీష్.

రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బ్యాంకర్ల సమావేశంలో రుణమాఫీపై స్పష్టత ఇచ్చామన్నారు. అటు రాష్ట్రంలో ఈసారి 41 లక్షల 43 హెక్టార్లలో పంటలు వేశారన్న పోచారం.. 5 లక్షల 68 వేల హెక్టార్లలో వరినాట్లు వేశారని తెలిపారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పంటలకు కొంతమేర నష్టం జరిగిందని మంత్రి చెప్పారు. అటు కాంగ్రెస్, బీజీపీ, టీడీపీ రైతు ఆత్మహత్యలపై మాట్లాడడం సరికాదన్నారు. గత ప్రభుత్వాలు వెల్లడించిన లెక్కల ప్రకారమే 2009లో 196 మంది, 2010లో 132, 2012లో 147, 2013లో 112, 2014లో 184 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. 2015లో ఇప్పటివరకు 141 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించామన్నారు.

రైతు ఆత్మహత్యలను రాజకీయాల కోసం వాడుకుంటున్న ప్రతిపక్షాలను మంత్రి తుమ్మల కడిగిపారేశారు. తెలంగాణ రైతు ఒక్క పంట ఎండిపోయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు. ఎరువుల దగ్గర్నుంచి సాగునీటి వరకు రైతాంగం శ్రేయస్సు కోసమే పనిచేస్తున్న ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేసే వాళ్లంతా- ఒక్కసారి గతం గుర్తు చేసుకోవాలన్నారు. టీఆర్ఎస్ సర్కార్ రైతు సంక్షేమం కోసమే పనిచేస్తుందని మంత్రులు తేల్చి చెప్పారు. అన్నదాతలు ధైర్యాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *