Monday, 2 November 2026

సహకార ఎన్నికల్లో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్ధితులు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సహకార ఎన్నికల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లుగా వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లా సహకార ఎన్నికల్లో తమ ఓట్లను వేరేవాళ్లు వేశారని మదనపల్లెలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో సహకార సంఘాల ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనధికారికంగా వైకాపా కార్యకర్త ఓటేశారని తెదేపా, కాంగ్రెస్‌ ఆందోళన  చేపట్టాయి. పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతపురంలో ఆవులన్న సహకారసంఘం ఎన్నికలో బ్యాలెట్‌ పేపర్లను అడ్డంగా మడిచి ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. రీపోలింగ్‌కు డిమాండ్‌ చేస్తూ ఆవులన్న గ్రామంలో తెదేపా శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. కర్నూలులో మూడో వార్డులో ఓటు వేసేందుకు వెళ్లిన తెదేపా కార్యకర్తపై దాడి జరిగింది. దాంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంటూరులో నాలుగు పోలింగ్‌ కేంద్రాల వద్ద కాంగ్రెస్‌, తెదేపాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగాయి. నరసరావుపేట మండలం ఇక్కూరు సహకార పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు సమాచారం తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *