Wednesday, 4 November 2026

సాగర్‌లో నిమజ్జనం నిలిపివేతపై పరిశీలించండి: హైకోర్టు

హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనాన్ని నిలిపివేసేందుకు సాధాసాధ్యాలను పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీకి హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే విగ్రహాల ఎత్తుతగ్గింపునకు ఎలాంటి చర్యలు అవసరమో అధ్యయనం చేసి తమకు తెలపాలని ఆదేశించింది. విగ్రహాల నిమజ్జనంతో చెరువుల్లోని నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు అమలుచేయడం లేదంటూ న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి.బోస్లే, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. బెంగళూరులో అనుసరిస్తున్న నిమజ్జన విధానంపై అధ్యయనం చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అక్కడ సరస్సులో కొంత భాగం మాత్రమే నిమజ్జనానికి వినియోగిస్తున్న విధానం బాగుందని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై జీహెచ్‌ఎంసీ న్యాయవాది సోమవారం వాదనలు వినిపిస్తూ.. బెంగళూరు విధానాన్ని అధ్యయనం చేశామని కోర్టుకు తెలిపారు. అక్కడ విగ్రహాలు 8అడుగులకు మించి లేవని, ఇక్కడ 64 అడుగుల వరకు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడి విధానం ఇక్కడ అమలు కష్టంగా ఉంటుందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం హుస్సేన్‌సాగర్‌లో ఈ ఏడాదికి నిమజ్జనం నిషేధించి, విగ్రహాలకు ఇతర ప్రదేశాల్లో నిమజ్జనం చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించింది. ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *