సాగుచట్టాల రద్దు సంగతి సరే..
మరణించిన రైతుల సంగతి పట్టించుకోరా
లోక్సభలో ప్రస్తావించిన ఎంపి రాహుల్
న్యూఢల్లీి,డిసెంబర్7 (జనంసాక్షి) : సాగుచట్టాలను రద్దుచేసిన ప్రధాని మోడీ మరణించినరైతుల గురించి మాట్టాడడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావించారు.. కిసాన్ ఆందోళనలో 700 మంది రైతులు అమరులయ్యారన్నారు. దేశ రైతుల నుంచి ప్రధాని క్షమాపణలు కోరారు, కానీ ఆ అమర రైతుల డేటా ప్రభుత్వం దగ్గర లేదని ఆయన ఆరోపించారు. తప్పు చేసినట్లు ప్రధాని ఒప్పుకున్నారని, కానీ వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం ప్రాణాలు కోల్పోయిన రైతుల సమాచారం ఇవ్వడం లేదన్నారు. నవంబర్ 30వ తేదీన వ్యవసాయ మంత్రిని ప్రశ్నించగా.. తమ వద్ద మరణించిన రైతుల డేటా లేదని చెప్పినట్లు రాహుల్ తెలిపారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు పంజాబ్ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిందని రాహుల్ అన్నారు. తన దగ్గర ఆ లిస్టు ఉందని, దాన్ని హౌజ్లో పెట్టామన్నారు. హర్యానాలోనూ అమర రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చిన లిస్టు కూడా సభలో పెట్టామన్నారు. ఇలాంటి సందర్భంలో రైతులు ఎవరూ చనిపోలేదని ప్రభుత్వం ఎలా చెబుతుందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. క్షమాపణలు చెప్పిన ప్రధాని.. రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. పంజాబ్లో 400 మంది రైతులకు సుమారు 5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారన్నారు. 152 మందికి జాబ్స్ కూడా ఇచ్చారు. హర్యానాలో 70 మంది అమర రైతుల జాబితా తయారు చేశామన్నారు. రైతులకు వాళ్ల హక్కుల్ని ఇవ్వాలని, నష్టపరిహారంతో పాటు వాళ్లకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు.