Wednesday, 4 November 2026

సామాన్యులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు

 హైదరాబాద్: ఇంటికి వెళ్లేందుకు సరైన రోడ్లు ఉండవు.. ఇరుకైన రోడ్లలో ఒకరు వస్తే.. మరొకరు వెయిట్‌ చేయాల్సిన దుస్థితి. ఇంటికి చుట్టాలు వస్తే రెండు రోజులు ఉండలేని పరిస్థితి. నలుగురు ఫ్రెండ్స్ ఇంటికి వస్తే ఇంటిముందున్న రోడ్డే వెయిటింగ్‌ హాల్. ఇది హైదరాబాద్‌లోని సామాన్యుడు నివాసం ఉండే ఇంటి పరిస్థితి. ఇప్పుడా పరిస్థితులకు చెక్‌ పడనుంది.. సామాన్యుల కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. సామాన్యుడు కూడా తలెత్తుకుని బతికే విధంగా.. సామాన్యులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మిస్తామని తెలంగాణ సర్కార్‌ హామీ ఇచ్చింది. సికింద్రాబాద్‌లోని ఐడీహెచ్‌ కాలనీలో ఈ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విశాలమైన హాల్‌,.. రెండు బెడ్‌రూమ్‌లు, కిచెన్‌, రెండు టాయిలెట్స్‌తో ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇందులో ఒకటి వెస్ట్రన్‌ టాయిలెట్‌ ఉండడం విశేషం.
దసరా పండుగకు లబ్ధిదారులకు ఇళ్లు
ఇక్కడ జి ప్లస్‌ 2 పద్ధతిలో మొత్తం 396 ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇక్కడ ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీలు కావడంతో ఆయా శాఖల నిధులు సమకూరాయి. దీంతో నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ కాలనీలో మౌలిక సదుపాయాలైన రోడ్లు, విద్యుత్‌, త్రాగునీరు, డ్రైనేజి వ్యవస్థలను పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఒక మోడల్‌ కాలనీగా అవతరించనుంది. ఈ ఇళ్లను త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు దసరా పండుగలోపు అందిస్తామంటున్నారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌.
]డబుల్‌ రూమ్‌ ఇళ్లను సందర్శించిన ఆర్‌.ఆర్‌.మిశ్రా
తెలంగాణ సర్కార్‌ నిర్మిస్తున్న డబుల్‌ రూమ్‌ ఇళ్లను కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్‌.ఆర్‌.మిశ్రా సందర్శించారు. ఈ గృహ నిర్మాణ పథకాన్ని కేంద్రం నిర్మించతలపెట్టిన గృహ పథకం రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈ ఇళ్లు నిరుపేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని మిశ్రా అన్నారు. ఏది ఏమైనా ఇన్నేళ్లు అగ్గిపెట్టెల్లాంటి ఇరుకు ఇళ్లలో గడిపిన సామాన్యులు ఇకపై.. డబుల్‌ బెడ్‌ రూమ్‌లలో గడిపేయవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణాన్ని.. కేంద్ర గృహ నిర్మాణ పథకంలో ప్రవేశపెడితే దేశంలోని పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌లు దక్కుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *