హైదరాబాద్ : సినిమా ఫక్కిలోనే సినీ రంగ ప్రముఖులు దారి దోపిడీకి గురయ్యారు. సినిమాల్లో చూపించే విధంగానే రోడ్డుకు అడ్డంగా చెట్టు నరికి వేసి దారి దోపిడీ చేశారు దుండగులు. తమ ఆలోచనలు తమకే ఎదురుదెబ్బ తగిలేలా చూపించారు దుండగులు. సినీ ప్రముఖులు దారి దోపిడీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మార్చి 26న ప్రకాశ్ రాజ్ పుట్టిన రోజు వేడుకలు షాద్‌నగర్‌లోని ఆయన ఫాంహౌస్‌లో జరిగాయి. ఈ వేడుకలు ముగించుకుని రాత్రి 2 గంటల సమయంలో సినీ రచయిత కోన వెంకట్, నిర్మాత డీవీవీ దానయ్య, దర్శకుడు శ్రీనువైట్ల, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ హైదరాబాద్ పయనం అయ్యారు. వీరి రాకను గమనించిన కొందరు దుండగులు రోడ్డుకు అడ్డంగా చెట్లు నరికేసి దోపిడీకి పాల్పడ్డారు. గొడ్డళ్లతో వీరు ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగులగొట్టి వారి వద్ద ఉన్న ఉంగరాలు, బంగారు గొలుసులు, నగదు దోచుకెళ్లారు. దుండగులు దోచుకున్న సొత్తు మొత్తం విలువ రూ. 3 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
అయితే ఈ ప్రమాదం నుంచి శ్రీనువైట్ల, థమన్ తృటిలో తప్పించుకున్నారు. వెంకట్, దానయ్య దొంగల బారిన పడ్డారు. దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరం వెంకట్ షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దారి దోపిడీ ఘటనను పోలీసులు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై కోన వెంకట్ స్పందించారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని పేర్కొన్నారు. దుండగుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడినందుకు సంతోషంగా ఉందన్నారు. తన మెడపై కత్తి పెట్టి డబ్బులు ఇవ్వాలని దుండగులు బెదిరించారని తెలిపారు. తన డబ్బు పోతే పోయింది కానీ.. తన తదుపరి చిత్రానికి మంచి కథ దొరికిందని వెంకట్ వ్యాఖ్యానించారు. ఈ దారి దోపిడీకి సంబంధించిన సన్నివేశాలు క్రైమ్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న శంకరాభరణం చిత్రంలో ప్రేక్షకుల్ని అలరించవచ్చు అని పేర్కొన్నారు.




