Wednesday, 4 November 2026

– సినీ నటి అంజలి అదృశ్యం

– పోలీసులకు సోదరుడి ఫిర్యాదు
– ఐదు రోజుల క్రితం షూటింగ్‌ కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కు
– దస్‌పల్లా హోటల్లో బస..
– మా పిన్ని మంచిదే
– అసలేం జరిగిందో అర్థం కావట్లేదు
– మరో సోదరుడి వ్యాఖ్యలు
ప్రముఖ హీరోయిన్‌ అంజలి వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది. తన చెల్లెలు కనిపించడంలేదంటూ అంజలి సోదరుడు రవికిశోర్‌ హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమిళమీడియాకు ఇంటర్యూ ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఆమె అదృశ్యమైందని పేర్కొన్నారు.
ఇక.. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో తన బాబాయితో కలిసి బసచేసిన అంజలి.. సోమవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత అదృశ్యమైంది. పోలీసులు హోటల్‌ సీసీ ఫుటేజీపై దృష్టి సారించారు. మరోవైపు.. అంజలి తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని కళంజియం చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చెన్నై, హైదరాబాద్‌, మామిడికుదురు : తన పిన్ని భారతి, తమిళ దర్శకుడు కళంజియం మనసికంగా వేధిస్తున్నారంటూ తమిళ మీడియాకు ఇంటర్యూ ఇచ్చిన కొద్ది గంటల్లోనే.. హీరోయిన్‌ అంజలి మాయమైంది. ఈ మేరకు ఆమె సోదరుడు రవికిశోర్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ‘బోల్‌ బచ్చన్‌’ రీమేక్‌ షూటింగ్‌ నిమిత్తం తమిళనాడు నుంచి నగరానికి వచ్చిన ఆమె.. తన బాబాయి సూరిబాబుతో కలిసి దసపల్లా హోటల్‌లో బస చేసిందని, సోమవారం ఉదయం మాయమైందని, అప్పట్నుంచి కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అంజలి ఇంటర్మీడియట్‌ చదివేటప్పుడే పిన్ని భారతికి ఆమెను దత్తత ఇచ్చినట్లు చెప్పారు. తమతో ఫోన్‌లో మట్లాడేటప్పుడు… పిన్ని వేధింపుల గురించి చెప్పేదని తెలిపారు. అంజలి హైదరాబాద్‌కు వచ్చిన విషయం కూడా తనకు తెలియదని.. తమ బాబాయ్‌ ఫోన్‌లో చెప్పడంతో పోలీసులను ఆశ్రయించినట్లు రవికిశోర్‌ తెలిపారు. అంజలిని తానే దాచిపెట్టినట్లు పిన్ని భారతి అనుమానం వ్యక్తం చేస్తోందని, కానీ అంజలి తన వద్దకు రాలేదని ఆయన స్పష్టం చేశారు. అతడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అంజలి జాడను ఛేదించేందుకు హోటల్‌ సీసీ ఫులేజీపై దృష్టి సారించారు.
గత 15 రోజుల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అంజలి, సూరిబాబుల కోసం పి.వి.సి వెంచర్స్‌ అనే సంస్థ మార్చి 31న రూం బుక్‌ చేసినట్లు హోటల్‌ రికార్డులు చెబుతున్నాయి. ఆమె సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు హోటల్‌లోనే ఉన్నట్లు సిబ్బంది పోలీసులకు తెలిపారు. మరోవైపు.. అంజలి కోనసీమలోని తన స్వస్థలమైన మొగలికుదురు వచ్చినట్టు వార్తలు రావడంతో మీడియా అంతా అక్కడికి చేరుకుని ఆరా తీస్తోంది. ఈ వివాదంపై ఆమె సోదరుడు బాపూజీ స్పందించారు. తమ పిన్ని కూడా మంచిదేనని.. ఆమె, అంజలి సఖ్యతగానే ఉండేవారని, ఏం జరిగిందో అర్థం కావడం లేదన్నారు. అంజలితో మాట్లాడితే తప్ప ఏంజరిగిందో తెలియదని తెలిపారు.
నా గౌరవానికి భంగం.. కళంజియం
నిరాధారమైన ఆరోపణలతో తన గౌరవానికి భంగం వాటిల్లేలా ప్రవర్తించిందంటూ అంజలిపై తమిళ దర్శకుడు కళంజియం మంగళవారం ఉదయం చెన్నై పోలీసు కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. గౌరవప్రదంగా జీవిస్తున్న తన పరువును బజారుకీడ్చడానికి అంజలిని పావుగా ఉపయోగించుకుని ఎవరో తెరివెనుక నాటకమాడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ అంజలి స్వయంగా ఈ ఆరోపణలు చేసి ఉంటే
ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానన్నారు.
గౌరవంగా జీవిస్తున్న తన పరువును బజారుకీడ్చినందుకు పరువు నష్టం దావా వేస్తానని కళంజియం చెప్పారు. తన సినిమా కోసం అంజలి కాల్షీట్లు ఇంకా 15 రోజులు మిగిలున్నాయని, ఆ ప్రకారం మేలో చిత్రీకరణకు హాజరుకాకపోతే నడిగర్‌ సంఘం, నిర్మాతల మండలి ద్వారా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కాగా… తన సోదరి కూతురైన అంజలిని పదిహేనేళ్ల వయసులో దత్తత తీసుకున్నానని, సొంత కూతురిగా చూసుకుంటూ హీరోయిన్‌గా ఎదిగేందుకు కృషిచేశానని భారతీ దేవి వివరించారు.
ౖ’అంగాడి తెరు’ (తెలుగులో ‘షాపింగ్‌మాల్‌’) చిత్రంలో స్టార్‌డమ్‌ రావడంతోనే ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తనపై ఇలాంటి ఆరోపణలు చేయడానికి ఇంకెవరో కారణమై వుంటారని భారతీదేవి అనుమానం వ్యక్తం చేశారు. వీరిరువురిపై ఆరోపణలు చేసిన అంజలి… ఆ తర్వాత 48 గంటలు గడుస్తున్నా ఇంకా బయటికి రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆమె నటించాల్సినే సినిమా షూటింగ్‌లు కూడా రద్దయ్యే పరిస్థితి తలెత్తింది.
ఇదీ నేపథ్యం
అంజలి జన్మస్థలం తూర్ప గోదావరి జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామం. అంజలి విద్యాభ్యాసం రాజోలు ప్రాంతంలో సాగింది. ఆమెకు ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారని ఆమె సోదరుడు బాపూజీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *