Monday, 2 November 2026

సినీ పరిశ్రమకు అండగా ఉంటాం

-రాజమౌళికి అక్కినేని పురస్కారసభలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 17,(జనంసాక్షి):తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌ రావడానికి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ ఎంతో కృషి చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలుగు బిడ్డ పేరుతో పురస్కారాన్ని మరో తెలుగు బిడ్డకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అక్కినేని పురస్కారాన్ని అందుకున్న రాజమౌళి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన తీసిన ‘బాహుబలి’ని అద్భుత కళాఖండంగా అభివర్ణించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చనే కొత్త ఒరవడికి నాంది పలికారన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అక్కినేని నాగేశ్వరరావు స్ఫూర్తిని కొనసాగించేలా ఆయన పేరుతో పురస్కారాన్ని అందిస్తున్న కుటుంబాన్ని కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఆదివారం హైదరాబాద్‌ శిల్ప కళావేదికలో అక్కినేని జాతీయ పురస్కార వేడుక జరిగింది. భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, అక్కినేని కుమారులు వెంకట్‌, నాగార్జున తదితరులు హాజరయ్యారు. అవార్డు అందుకున్న అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. ”1974లో అక్కినేని నాగేశ్వరరావుగారికి 55 సంవత్సరాలు. ఆయనకు గుండెపోటు వచ్చింది. చాలా పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి ఆపరేషన్‌ చేశారు. విజయవంతంగా పూర్తయిన తర్వాత.. ‘సర్‌ విూ గుండె 14 సంవత్సరాల పాటు గ్యారెంటీగా పనిచేస్తుంది’ అని చెప్పారు. వాళ్లు చెప్పినట్లుగానే ఏ సమస్య లేకుండా గడిచింది.1988లో మళ్లీ రెండోసారి గుండెపోటు వచ్చింది. అప్పుడు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయాలని ప్రయత్నించగా, గుండె చాలా బలహీనంగా ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ‘విూకు గుండె బలహీనంగా ఉంది. విూరు కేవలం కొద్దివారాలు మాత్రమే బతుకుతారు’ అని నాగేశ్వరరావుగారికి డాక్టర్లు చెప్పారట. అప్పుడు ఆయన అనుకున్నారట.. ‘డాక్టర్లు, మందుల సాయంతో 14 ఏళ్లు బతికాను. నా విల్‌ పవర్‌తో మరో 14 సంవత్సరాలు బతుకుతాను’ అని. అక్కడి నుంచి ఆయన కారు నెంబర్లన్నీ 2002 అని ఉండేవి. ‘2002 వరకూ నా జోలికి రావద్దు’ అని చావుకు వార్నింగ్‌ ఇచ్చి మరీ బతికారు. ఆయన క్రమశిక్షణ ఎలా ఉంటుందో దగ్గరగా చూసిన వారందరికీ బాగా తెలుసు. ఆయన మనో బలంతో చావును దూరంగా ఉంచారు. ఇక 2002 వచ్చింది. అప్పుడు మళ్లీ అనుకున్నారట. ‘నేను 14 సంవత్సరాలే కదా! అనుకున్నా చావు నా దగ్గరకు రావడం లేదే’ అని. అప్పుడు ఆయన బయటకు వెళ్తూ 9 నెంబర్‌ చూశారట. మళ్లీ అనుకున్నారట ‘9 సంవత్సరాలు నా దగ్గరకు రావద్దు’ అని. అలా ఆయన చావుకే సవాల్‌ విసిరారు. 2011లో కూడా మరణం ఆయన దరిదాపులకు రాలేదు. ఇక బోరుకొట్టి ‘నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రా!’ అని అన్నారట. చివరకు దేవుడు వచ్చి కేవలం శారీరకంగానే ఆయనను మన నుంచి దూరం చేశాడు. కానీ, అక్కినేని కుటుంబం ఆయన ఆత్మను మనతోనే ఉండేలా చేసింది. ‘నేను రమ్మన్నప్పుడే నా దగ్గరకు రా’ అని చావుతో మాట్లాడిన వ్యక్తుల్లో మనకు తెలిసి మహాభారతంలో భీష్మాచార్యులు, ఈ కలియుగంలో అక్కినేని నాగేశ్వరరావు మాత్రమే.అంతటి మహానుభావుడి పేరువిూదున్న అవార్డును ఈ రోజు నాకు ఇస్తున్నారు. నేను అందుకు అన్ని విధాలా అర్హుడునా? అని ఆలోచిస్తున్నా. నాకు తెలిసి నేను దానికి అర్హుడను కాదు. ఇలాంటి అవార్డులు తీసుకుంటున్నప్పుడు రెక్కలు ఇచ్చినట్లు ఉంటుంది. కానీ నాగార్జున గారు నా భుజ స్కందాలపై పెద్ద భారాన్ని పెట్టారు. ఆ అవార్డుకు మరింత గౌరవం తెచ్చేందుకు నా శాయశక్తులా కష్టపడతా. అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు. 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు.