Thursday, 5 November 2026

సిపిఎం జనచైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్ : కేంద్రంలోని బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమము, మతసామరస్యం, ప్రజాస్వామ్య సామాజిక న్యాయం కోసం సిపిఎం అఖిలభారత కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 17 నుండి 29 వరకు జరుగు జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం నేరేడుచర్ల పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్ కోరారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయం అరిబండి భవన్లో జనచైతన్య యాత్ర గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు కట్టబెట్టిందన్నారు. సామాన్య ప్రజలపై భారాలు మోపుతూ దేశంలోని 23 కోట్ల మందిని పేదలుగా చేశారని, నిత్యవసర సరుకులు డీజిల్ పెట్రోల్ వంటగ్యాస్ సహా అన్ని రకాల సరుకుల ధరలు మూడు రెట్లు పెరిగాయన్నారు. దేశంలో సామాజిక న్యాయం కోసం రానున్న రోజుల్లో సమరశీల పోరాటలకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో సిపిఎం పట్టణ నాయకులు కుంకు తిరుపతయ్య ,అనేగంటి మీనయ్య, నీలా రామ్మూర్తి , శ్రీను ,ఎస్.కె ఆఫీస్, గుర్రం ఏసు కోదాటి సైదులు, కొండ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.