హైదరాబాద్,(జనంసాక్షి): పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చేలా చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్ధులతో బేరసారాలు దిగిన కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు సోమవారం కమిషన్ సభ్యుడు సీతారామరాజును అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సంధ్యను గత నెల 10నే అరెస్టు చేశారు. ఆమెను పోలీసు కస్టడీకి తీసుకున్న అధికారులు వివిధ కోణాల్లో విచారించారు. ఇందులో వెలుగులోకి వచ్చిన అంశాలతో పాటు దర్యాప్తులో సేకరించిన వివరాల ఆధారంగానే సీతారామరాజును అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీసీపీ లేళ్ల కాళిదాస్ వెంకట రంగారావు తెలిపారు.




