హైదరాబాద్ : స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే తెదేపా లక్ష్యమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామసభల ద్వారా అధికారులే ప్రజల దగ్గరకు వచ్చి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేసిందన్నారు. పంచాయతీ ఎన్నికలకు తెదేపా శ్రేణులను సన్నద్దం చేసేందుకు కొంపల్లిలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఉత్తరాఖండ్ బాధితులను మానవతా దృక్పథంతోనే తెలుగుదేశం పార్టీ అదుకుందన్నారు. బాధితులను అదుకోవడంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించలేదన్నారు. బాధితులను అదుకోవడంలో మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2లక్షలే పరిహారం ఇవ్వడం దారుణ మన్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ , నల్గొండ, నిజామాబాద్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తెదేపా నాయకులు, కార్యకర్తలు సదస్సుకు హాజరయ్యారు.




