హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరంలో శనివారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉత్తర కర్ణాటక నుంచి లక్షద్వీప్ వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదే విధంగా రాయలసీమ, తెలంగాణలో క్యుములోనింబస్ మేఘాలు కదులుతాయని తెలిపారు. అందుచేత అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని..శనివారం నుంచి రాయలసీమ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని సమాచారం.




