రాయదుర్గం: స్మార్ట్ ఫోన్ సేవల పేరుతో వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నాయి కొన్ని మొబైల్ కంపెనీలు. ఆఫర్లు ఇస్తున్నామని సెల్‌ఫోన్ సంస్థలు ప్రచారం చేస్తూ… కండిషన్స్ అప్లై అంటూ మెలిక పెడుతున్నాయి. లేజర్ బ్లేడ్ల తయారీ కంపెనీలో పనిచేసే జయచంద్రరాజు రిలయన్స్ సెల్‌ఫోన్ వినియోగిస్తున్నాడు. అందులో 4జీ నెట్ సౌకర్యం ఉండటంతో వాట్సప్ కోసం ఇంటర్నెట్‌ను ఆన్‌లో ఉంచాడు. ప్రతినెలా రూ. 1200 బిల్లు వచ్చేది. జూలైలో రూ. 2,12,607ల బిల్లు వచ్చింది. ఏదో పొరపాటున బిల్లు జనరేట్ అయి ఉండవచ్చని అనుకుంటుండగానే ఆగస్టు నెల బిల్లు సైతం రూ. 2,49,112 వచ్చింది. తన మొబైల్ కనెక్షన్‌ను మిస్‌యూజ్ చేశారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాల్ డాటాను పరిశీలించగా ఇంటర్నెట్ వాడినట్టు తేలింది. ఈ కేసు తమ పరిధిలోకి రాదని తేల్చి చెప్పారు. వినియోగదారులు ఆయా సంస్థల టారిఫ్, నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకొని ఫోన్‌లను వినియోగించాలని, స్మార్ట్‌ఫోన్‌లు వాడేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.




