స్వీయనిర్బంధంలో :ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. జ్వరం, గొంతునొప్పి లక్షణాలు కనిపించడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు సీఎం కేజ్రీవాల్‌. ఆయన కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు. కేజ్రీవాల్‌కు మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో 28,936 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 812 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవాళ ఉదయం ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ మీడియాతో మాట్లాడారు. రాబోయే రెండు వారాల్లో ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 56 వేలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి 8,500 నుంచి 9 వేల వరకు బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. మరో 15 రోజుల్లో బెడ్ల సంఖ్యను 15 వేల నుంచి 17 వేలకు పెంచుతామన్నారు. కేంద్రం సరైన సమయంలో విమానాలను ఆపేసి ఉంటే.. తీవ్రత ఇంతగా ఉండేది కాదన్నారు ఆరోగ్య శాఖ మంత్రి.