రాష్ట్రం నుంచి 2015 సంవత్సరం పవిత్ర హజ్‌కు బయలుదేరనున్న ముస్లిం యాత్రీకులను సురక్షితంగా పంపించేందుకు 22ప్రభుత్వ శాఖలు సమన్వయం, సమష్ఠి కృషితో పనిచేయాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలి కోరారు. ఈ మేరకు యుద్ధప్రతిపాదికన ఏర్పాట్లు చేయాలని కోరారు.
గురువారం సాయంత్రం నాంపల్లిలోని హజ్ భవన్‌లో హజ్‌కమిటీ నిర్వహించిన వివిధ శాఖల సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హహజ్ యాత్రీకులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ యాత్రీకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని, దీనికోసం ఎంతఖర్చయినా ఫర్వాలేదని భరోసా ఇచ్చారని ఆయన వెల్లడించారు. యాత్రీకులకు సౌకర్యాలు, బస, భోజనం, ఎయిర్‌పోర్టుకి తరలించడం ఇతరత్రా వాటికి రూ.2 కోట్లు ఖర్చుచేస్తున్నామని, ఇవి చాలకుంటే మరిన్ని నిధులు ఇస్తామన్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కూడా యాత్రీకులకు విస్తృత సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఈ మేరకు ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించామని మహమూద్ అలి వెల్లడించారు. వక్ఫ్‌బోర్డులో పదవీ విరమణ చేసిన వారు మళ్లీ విధులు నిర్వహిస్తున్నరంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మహమూద్ బదులిస్తూ రాష్ట్ర విభజన, ఉద్యోగాల పంపకాల్లో జాప్యం వల్లనే తప్పనిసరిగా వారితో పనిచేయించుకుంటున్నామని, త్వరలో కొత్త పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర మైనారిటీ శాఖ కార్యదర్శి అరుణ, రాష్ట్ర మైనారిటీ శాఖ డైరెక్టర్ ఎంజే అక్బర్, రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఆచార్య ఎస్‌ఎ షూకుర్, మైనారిటీ ఆర్థికశాఖ ఎండీ మహమ్మద్ షఫీఉల్లా తదితరులు పాల్గొన్నారు.




