100 కోట్ల కుంభకోణంపై మంత్రి స్పందించాలే-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 15.(జనంసాక్షి). వేములవాడ నియోజకవర్గం లో 100 కోట్ల భూ కుంభకోణం జరిగిందని శాసనసభ్యులు చేన్నమనేని రమేష్ బాబు చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ డిమాండ్ చేశారు. శనివారం సిరిసిల్లలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మహేష్ మాట్లాడుతూ గత ఆరు మాసాలుగా వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు 100 కోట్ల విలువైన భూమి ఆక్రమణకు గురైంది అంటూ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ తో పాటు మంత్రి కేటీఆర్ వరకు ఎవరు స్పందించకపోవడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఇంత పెద్ద కుంభకోణం గురించి ఎమ్మెల్యే బహిరంగంగా విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ స్పందించి 100 కోట్ల ఆక్రమణ విషయంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలోని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆక్రమణలకు పాల్పడడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో బిజెపి నాయకులు ఆడెపు రవీందర్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు