Wednesday, 4 November 2026

2023 లో నాలుగు కొత్త గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి

2023 లో నాలుగు కొత్త గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి……..
మూడు ఉపరితల గనుల ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు చర్యలు…….
నూతన గనుల సమీక్షా సమావేశంలో సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్….
…………………
ఈ కొత్త ఏడాదిలో ఒడిశా లోని నైనీ బొగ్గు బ్లాక్ తో పాటు మరో మూడు ఉపరితల గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కాలపరిమితికి లోబడి యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సింగరేణి లో కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులపై బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, ప్రాజెక్టు ప్లానింగ్ అధికారులు, ఏరియాల జీఎంలతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి సంస్థ రానున్న ఐదేళ్ల లో చేపట్టనున్న 10 ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించిన ఆయన ఈ కొత్త సంవత్సరంలో కనీసం నాలుగు గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని సూచిస్తూ అందుకు దశలవారీగా చేపట్టాల్సిన కార్యాచరణను నిర్దేశించారు.
ఒడిశా రాష్ట్రంలో సింగరేణి చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి వచ్చే నెల నుంచి ఓవర్ బర్డెన్ తొలగింపు మొదలు పెట్టాలని, మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని స్పష్టంచేశారు. అలాగే కొత్త గూడెం లో చేపట్టిన వీకే కోల్ మైన్ నుంచి ఈ ఏడాది జూన్ నుంచి ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించాలని, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఉపరితల గని, ఇల్లందు ఏరియాలోని జేకే ఓసీ విస్తరణ (రొంపేడు) గని నుంచి జులై నుంచి ఉత్పత్తి కి సన్నాహాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ గనులకు సంబంధించిన అటవీ, పర్యావరణ తదితర అనుమతులు పొంది ఓబీ కాంట్రాక్టులు కూడా ఖరారు చేయాలని దిశా నిర్దేశం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం లో బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీకే ఓసీ తదితర గనుల ప్రారంభానికి అన్ని అనుమతులు సాధించాలని, దీని కోసం ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని సూచించారు.
ప్రస్తుతం ఉత్పత్తి ప్రారంభించిన కొత్త ఓపెన్ కాస్టు గనుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను పెంచుతూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలనే ప్రారంభించిన జీడీకే కోల్ మైన్ నుంచి ఏడాదికి 30 లక్షల టన్నులు, ఇందారం ఓపెన్ కాస్టు నుంచి 26 లక్షల టన్నులు, కేకే ఓసీ గని నుంచి 22.5 లక్షల టన్నుల బొగ్గు ను ఉత్పత్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) ఎస్. చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) ఎన్. బలరాం, డైరెక్టర్ (ఇ అండ్ ఎం) డి. సత్యనారాయణ రావు, అడ్వయిజర్ మైనింగ్ డి.ఎన్. ప్రసాద్, అడ్వయిజర్ ఫారెస్ట్రీ సురేంద్ర పాండే, ఈడీ కోల్ మూమెంట్ జె. ఆల్విన్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం. సురేష్, జనరల్ మేనేజర్ (సీపీపీ) సి.హెచ్. నర్సింహ రావు, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) కె. సూర్యనారాయణ, జీఎం(పీ అండ్ పీ) కొండయ్య, జీఎం(ఎస్టేట్స్) రవిప్రసాద్, కార్పోరేట్ జీఎంలు, అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.
-జనం సాక్షి – హైదరాబాద్