స్వర్ణకార వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేయాలి
జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌కు స్వర్ణకారుల వినతి
జనంసాక్షి , మంథని : కార్పోరేట్ జూవెల్లరి షాప్‌ల మూలంగా ఉపాధి కోల్పోతున్న స్వర్ణకారులకు చేయూతనందించేలా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్‌కు మంథని పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. మంథని పట్టణంలోని రాజగృహాలో స్వర్ణకారులు జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌ను కలిసి తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాధి కోల్పోయిన స్వర్ణకారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో స్వర్ణకారులు కీలక పాత్ర పోషించారని వారు గుర్తు చేశారు. కులవృత్తులను కాపాడే దిశగా ప్రభుత్వం ఆనేక పథకాలను అమలు చేస్తుందని, ఈ క్రమంలో స్వర్ణకారులకు ఉపాధి మార్గాలు చూపించేలా స్వర్ణకార వెల్పేర్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. స్వర్ణకారులకు భరోసా కల్పించే విధంగా పథకాలను అమలు చేయాలని, తమ కులవృత్తిని పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా ఆయనను వినతిపత్రం ద్వారా కోరారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ స్వర్ణకారుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.