జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ ఎస్పీ కి పిర్యాదు చేసిన జర్నలిస్టులు.
నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో,జనంసాక్షి:
నాగర్ కర్నూల్ పట్టణ పోలీసులు కొందరు జర్నలిస్టుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ మంగళవారం మధ్యాహ్నం నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కే మనోహర్ కు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు.జిల్లా కేంద్రంలోని ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మరియు యూట్యూబ్ ఛానల్ ల ప్రతినిధులు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కే మనోహర్ ను కలిశారు.నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన పోలీసులు వ్యవహరిస్తున్న జర్నలిస్టు వ్యతిరేక విధానాల పట్ల ఎస్పీకి వినతి పత్రం అందజేశారు.ప్రధానంగా నాగర్ కర్నూల్ టౌన్ ఎస్సై జర్నలిస్టులను బెదిరించడం వారికి వ్యతిరేకంగా కేసులు చేస్తానంటూ హెచ్చరించడం తోపాటు ఎస్సై వ్యవహార శైలిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు.ఈనెల 14న నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో పాలమూరు రంగారెడ్డి భూ నిర్వాసితుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనను నిరసిస్తూ బిజెపి ఆందోళన చేస్తున్న సమయంలో వార్త కవరేజ్ కి వెళ్ళిన విజన్ ఆంధ్ర స్టాఫ్ రిపోర్టర్ జి. సహదేవుడుపై నాగర్ కర్నూల్ ఎస్సై తోపాటు బిజినపల్లి ఎస్సై దాడి చేసి కొట్టడమే కాకుండా తెలకపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.ఆ విషయంలో సదరు ఎస్సై లపై చర్య తీసుకోవాలని జర్నలిస్టులు ఎస్పీకి ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.దీంతోపాటు జర్నలిస్టులు రాసే వార్తలపై రాజకీయ పార్టీల సోషల్ మీడియా సభ్యులు వ్యక్తిగతంగా రిపోర్టర్ల పై పత్రిక మరియు ఛానల్ లపై దుర్భాషలాడుతూ పోస్టింగ్ లు పెడుతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.జిల్లాలో జర్నలిస్టులపై భౌతిక దాడులు జరిగినప్పుడు పోలీసు ,జర్నలిస్టులు, న్యాయవాది సభ్యులుగా అటాక్స్ కమిటీ వేయాలని,ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. జిల్లాలోని పోలీసు యంత్రాంగం జర్నలిస్టుల విధి నిర్వహణలో అడ్డంకులు సృష్టించకుండా వారికి తగు సూచనలు ఇవ్వాలని కోరారు.నాగర్ కర్నూల్ జిల్లా తో పాటు అన్ని పోలీస్ స్టేషన్ లలో క్రైమ్ కు సంబంధించి విలేకరులకు సమాచారం ఇచ్చేందుకు పి.ఆర్.ఓ ను ఏర్పాటు చేయాలని లేదా ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలని కూడా జర్నలిస్టులు ఎస్పీకి ఇచ్చిన వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో
ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మరియు యూట్యూబ్ ఛానల్ ల ప్రతినిధులు పాల్గొన్నారు.




