చివరి అయకటు వరకు నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలి

భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్
వనపర్తి బ్యూరో సెప్టెంబర్19 (జనంసాక్షి)
సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి కావడమే కాకుండా చివరి అయకటు వరకు నీరు అందించడానికి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డివిజనల్ స్థాయి టాస్క్ఫోర్స్ బృందం తో కలెక్టర్ భూసేకరణ, భునిర్వసితులకు పరిహారం, పునరావాసం పై సమీక్ష నిర్వహించారు. వనపర్తి జిల్లాలోని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, రాజీవ్ భీమా ఎత్తిపోతల రిజర్వాయర్, డిస్ట్రిబ్యూటరి కెనాల్ సర్వే, భూసేకరణ పై డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిజర్వాయర్ నిర్మాణం తో పాటు డిస్ట్రిబ్యూట్రి కెనాల్ నిర్మాణం పూర్తి అయితే నే రైతులకు సాగునీరు అందుతుందని అందువల్ల సర్వే తో పాటు అవార్డులు పాస్ చేసి భూమి కోల్పోతున్న రైతులకు పరిహారం అందించే విధంగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఒక ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని ఏ రోజు ఎవరు ఎక్కడ సర్వే చేయనున్నారు, ఏ పని పూర్తి చేయనున్నారు అనేది నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రత్యేక కలెక్టర్ భూసేకరణ విభాగం తో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ కలిసి సంయుక్తంగా పనులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. బుద్ధారం , ఘనపూర్ కు సంబంధించిన d7, d8 పై ప్రత్యేక దృష్టి సారించాలని ఇరిగేషన్ డి. ఈ లు, సర్వేయర్లను ఆదేశించారు. అవార్డ్స్ పాస్ అయిన వాటి పై ఎప్పటికప్పుడు రికన్సిలేశన్ చేసుకోవాలని సూచించారు. వచ్చే వారం రోజుల్లో కనీసం ఒక ప్రాజెక్టు భూసేకరణ పనులు పూర్తి అయ్యేవిధంగా చూసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా భూసేకరణ అనేది నియమ నిబంధనల మేరకు చేపట్టడం జరుగుతుందని, రైతులు సైతం పెద్ద మనసుతో అర్థం చేసుకొని అధికారులకు సహకరించాలని కలెక్టర్ రైతులను కోరారు. అనంతరం కనాయపల్లి, కాంచేరువు పునరావాస కేంద్రాల స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత త్వరగా అర్హులైన వారందరికీ పునరావాస కేంద్రాల్లో ప్లాట్లు కేటాయించటం తో పాటు మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈ. ఈ. పి. మధుసూధన్ రావు, డి. ఈ వెంకటరమణ దేవి, డి. ఈ లు అబ్దుల్ గఫార్, నరేందర్ రెడ్డి, కిరణ్ కుమార్, ఎ. ఈ లు తదితరులు పాల్గొన్నారు.




