ప్రభుత్వ భూములతో వ్యాపారం చేయద్దు.. ఇండ్లు లేని పేదలకు కేటాయించాలి.
సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు గుడిసెలు వేసేందుకు యత్నం.
అడ్డుకున్న పోలీసులు, పలువురు నాయకుల అరెస్ట్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 20. (జనంసాక్షి). సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములను వెంచర్లు వేసి అమ్మకం చేయొద్దని అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్దూరు శివారులో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములను డబల్ బెడ్ రూమ్ ఇండ్లు రాని నిరుపేదలకు ఇవ్వాలని కోరుతూ ఆ భూముల్లో గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు సిపిఎం పార్టీ నాయకులను నిరుపేదలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది సిపిఎం పార్టీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో పది సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇండ్లు లేని పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందలేదని అన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అర్హులైన పేదలకు నివేశన స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు ఇవ్వకుండా వెంచర్లు వేసి అమ్ముకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అర్హులైన పేదలందరికీ నివేశన స్థలాలు అందే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో నాయకులు ఎలిగేటి రాజశేఖర్, నక్క దేవదాస్, గోవిందు లక్ష్మణ్, కంది మల్లేశం, స్వప్న, లావణ్య, సురేష్, మోర తిరుపతి ,తదితరులు పాల్గొన్నారు




