Thursday, 5 November 2026

33 జిల్లాల చరిత్ర సంస్కృతి సమగ్ర సంపుటాలు రూపొందిస్తున్నాం

33 జిల్లాల చరిత్ర సంస్కృతి సమగ్ర సంపుటాలు రూపొందిస్తున్నాం.. ..పండుగలా ఘనంగా మంచిర్యాల జిల్లా సమగ్ర స్వరూపం పుస్తక ఆవిష్కరణ

 

———————————————–సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి వెల్లడి
———————————————– 15 వేల పేజీల్లో33 జిల్లాల తెలంగాణ చరిత్ర, సంస్కృతి,సాహిత్యం మొదలైన అంశాలపై సమగ్ర సంపుటాలను వెలువరించేందుకు తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టిందని పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య వెల్లడించారు .ఈ ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన తొమ్మిదవ సంపుటం మంచిర్యాల జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథాన్ని శ్రీ సరస్వతి శిశు మందిర్ హాలులో శనివారం జరిగిన సభలో ఆయన ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నేతృత్వంలో ప్రభుత్వం పది జిల్లాల తెలంగాణ 33 జిల్లాలుగా ఏర్పాటుచేసిన స్ఫూర్తితో ఈ ప్రాజెక్టుని పరిషత్తు చేపట్టిందని, ఇప్పటివరకు జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల సంపుటాలు పూర్తయి ఆవిష్కృతమయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలకు వెళుతున్నప్పుడు ఆయా జిల్లాల్లో తరతరాలుగా సంక్రమించిన ఉజ్వలమైన సాహిత్య సాంస్కృతిక చారిత్రక విశేషాల సంపద ఎంతగానో ఆనందాశ్చర్యలకు గురి చేస్తున్నదని తెలిపారు. మంచిర్యాల జిల్లా సంపుటి కోర్ కమిటీ కన్వీనర్ ప్రముఖ కవి, గోపగాని రవీందర్ మాట్లాడుతూ ఆరు నెలలుగా వ్యాసకర్తల సహకారంతో శ్రమించి 400 పేజీల మంచిర్యాల వైభవ ప్రదర్శకమైన సంపుటి తీసుకొచ్చామని తెలిపారు. పరిషత్తు తమకందించిన అవకాశం వల్ల ముందు తరాలకు మంచిర్యాల గొప్పదనాన్ని అక్షరబద్ధం చేసి అందిస్తున్నామని పేర్కొన్నారు .ఈ సందర్భంగా జరిగిన సభలో కోర్ కమిటీ సభ్యులు ప్రముఖ కవి రచయితలు కొండు జనార్ధన్,దండ నాయకుల వామన్ రావు, అల్లాడి శ్రీనివాస్, తోకల రాజేశం, ఎస్. నీలాదేవి పాల్గొన్నారు. కోర్ కమిటీ సభ్యుడు రాష్ట్రపతి అవార్డు గ్రహీత, పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి సభను విజయ
వంతంగా నడిపించారు.

సంపుటాల్లో వివిధ అంశాలపై వ్యాసాలు రచించిన 47 మంది వ్యాస రచయితలను పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య చేతుల మీదుగా సత్కరింపజేశారు. పలువురు కవులు, కవయిత్రులు మంచిర్యాల వైభవం అనే అంశంపై తమ కవితలు గానం చేశారు. మంచిర్యాల జిల్లాకు ముత్యబోయిన మలయశ్రీ, బోనగిరి రాజారెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.