5 లక్షల ఇళ్లలో టీవీలు బంద్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహా నగరంలో సోమవారం బుల్లితెర వినోదానకి తెరపడింది. సెట్‌ టాప్‌ బాక్స్‌లు లేకపోవడంతో అనలాగ్‌ సంకేతాలు నిలిచిపోయాయి. కేబుల్‌ టీవీ రంగాన్ని డిజిటైజేషన్‌ చేయడంలో భాగంగా హైదరాబాద్‌, విశాఖ నగరాల్లో సెట్‌టాప్‌ బాక్స్‌లు బిగించాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఆదివారంతో ముడిసింది. విశాఖ నగరంలో ఈ గడువును 15 రోజులు పెంచారు. హైదరాబాద్‌లో మాత్రం గడువు పెంచకపోవడంతో బాక్స్‌లు బిగించని టివీలు మూగబోయాయి. నగరవ్యాప్తంగా హాత్‌వే కేబుల్‌ కనెక్షన్లున్న సుమారు ఐదు లక్షల ఇళ్లకు ప్రసారాలు నిలిచిపోయినట్లు కేబుల్‌ ఆపరేటర్లు తెలిపారు. రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలోనూ టీవీలు మూగబోయాయి. నగరవ్యాప్తంగా హాత్‌వే, సిటీ విజన్‌, డిజికేబుల్‌, సీటివీ, సంస్థలకు చెందిన సుమారు 30 లక్షల కేబుల్‌ కనెక్షన్లున్నాయి. వీటిలో సోమవారం హత్‌వే ప్రసారాలు నిలిచాయి. నెట్‌టాప్‌ బాక్సుల నిబంధన హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని మండలాలకు మాత్రమే వర్తించినప్పటికీ, శావారు ప్రాంతాల్లో ప్రసారాలు నిలిచిపోయాయి.
దీంతో సెట్‌టాప్‌ బాక్సుల విషయంలో హైదరాబాద్‌, రంగారెడ్డి అర్బన్‌ జిల్లాల మధ్య స్పష్టతనివ్వాలని కేబుల్‌ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. వారు సోమవారం నోడల్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఇ. శ్రీధర్‌ను జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలిపి ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. సెట్‌టాప్‌ బాక్‌లు బిగించడానికి గడువును పెంచాలని ఆపరేటర్లు కోరుతున్నారు. ఈ బాక్స్‌లపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, ధరలను గణనీయంగా తగ్గించడం, వాటిని విక్రయించేందుకు మరిన్ని కంపెనీలకు అనుమతించడమే సమస్యకు పరిష్కారమని వారు అంటున్నారు. వాస్తవానికి సెట్‌టాప్‌ బాక్స్‌ల తయారీదారులు 10 మంది వరకు రిజిస్టర్‌ చేసుకున్నట్లు చెబుతున్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 4 సంస్థలకే అనుమతి ఇచ్చిందని ఆపరేటర్లు చెబుతున్నారు. దీనివల్ల బాక్స్‌ల ధరలు ఎక్కువగా ఉండటమే కాకుండా, బాక్స్‌ల కొరత కూడా ఏర్పడుతోందని తెలిపారు.

తాజావార్తలు