కరీంనగర్: జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు అదివారం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. ఓదెల మండల కేంద్రంలోని దేవస్థానంలో జరిగిన ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా అదివారం అర్ధరాత్రి శివసత్తుల కేరింతలు, ఒగ్గు పూజారుల ఢమరుక నాదాలతో అలయ పరిసరాలు మారుమోగాయి. ముందుగా భద్రకాళీమాతను మంగళహారతులతో పూజించిన పూజారుల అనంతరం మల్లన్న స్వామికి ముత్యాల పోలు నిర్వహించి పెద్దపట్నంపై ప్రతిష్ఠించారు. సోమవారం తెల్లవారుజామున మల్లన్న దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అగ్నిగుండం కార్యక్రమం నిర్వహించారు. పలువురు భక్తులు అగ్నిగుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. ఈ బ్రహోత్సవాల్లో అలాయానికి సుమారు కోటి రూపాయల అదాయం వచ్చినట్లు అలయ కార్యనిర్వహణాధికారి మారుతి తెలిపారు.




