హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహించడానికి పంచాయతీ రాజ్ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 26 నుంచి ఎంపీటీసీ స్థానాల వర్గీకరణ, ఖరారు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. కార్పొరేషన్లు , మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో గ్రామాల విలీనంతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఎంపీటీసీ స్థానాలను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది. అందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది. ఎంపీటీసీ స్థానాల ఖరారుకు కొన్ని జిల్లాలో నగర పంచాయతీల ఏర్పాటు , గ్రేటర్ హైదరాబాద్‌లో విలీన నిర్ణయంపై కోర్టులో కేసులు ప్రధాన అవరోధంగా మారాయి. వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి ఎంపీటీసీ స్థానాల వర్గీకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో రిజర్వేషన్ల జాబితాను ఈసీకి ఇవ్వనుంది.




