హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలకు తెరలేపిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తెలంగాణవాదులు నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు ఆంధ్రా బాబే అని మరోసారి నిరూపించుకున్నారని తెలంగాణవాదులు అనుకుంటున్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని రాజ్యాంగబద్దంగా రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని కేంద్రం స్పష్టంగా చెప్పిన రోజుకో మాట మాట్లాడుతున్నాదంటూ తెలంగాణపై బాబు వ్యతిరేకతను బయటపెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రం వెనక్కి వెళ్లినప్పుడు ఒక్క మాట మాట్లాడని చంబ్రాబు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కుట్రలు బయటపడుతాయని ఢిల్లీ, సీమాంధ్ర టూర్ రద్దు చేసుకున్నారని తెలంగాణవాదులు అంటున్నారు. చంద్రబాబు వ్యవహారంతో తెలంగాణలో టీడీపీ బతికి బట్టకట్టడం కష్టమేనని స్పష్ట చేశారు. తెలంగాణ టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతామని తెలంగాణవాదులు తేల్చిచెప్పారు.




