టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్కసుమన్‌తో సహా పలువురి అరెస్టు
ఏపీఎన్జీవోలు, పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు
పోలీసుల తీరుకు నిరసనగా విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్, సెప్టెంబరు7 : ఎల్బీ స్టేడియానికి ఆనుకొని ఉన్న నిజాం కళాశాల వద్ద శనివారం ఉదయం నుంచి ఉద్రికత్త నెలకొంది. హాస్టల్ విద్యార్థులు టిఫిన్ చేస్తుండగా.. పోలీసులు హాస్టళ్లలోకి జొరబడి నాన్‌బోర్డర్స్‌ను బయటకు పంపే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థులు అడ్డుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి అంతకు ముందే పలువురు విద్యార్థులు నిజాంకళాశాల హాస్టల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం.. తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు హాస్టల్‌పైకి ఎక్కి ఎల్బీ స్టేడియంలోకి వెళుతున్న ఏపీఎన్జీవోలపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు ఒకవైపు, విద్యార్థులు మరోవైపు నిలబడి పరస్పరం దాడులు చేసుకోవడంతో యుద్దవాతావరణం నెలకొంది. ఏపీఎన్జీవోలను పోలీసులు వేరే మార్గం గుండా స్టేడియంలోకి పంపారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు బాల్కసుమన్ అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆయనతో పాటు పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు. అయినా విద్యార్థులు ఊరుకోకుండా ఆందోళన కొనసాగించారు. మధ్యాహ్నం వరకు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య గొడవల్లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.




