పదిజిల్లాల్లో తెలంగాణ బంద్ విజయవంతం
పదిజిల్లాల్లో స్తంభించిన రాకపోకలు
మూతబడ్డ వాణిజ్య, వ్యాపార సముదాయాలు
సెలవులు ప్రకటించిన పాఠశాల యాజమాన్యాలు
హైదరాబాద్, సెప్టెంబరు7 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజాస్వామ్య, రాజ్యాంగ, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా టీజేఏసీ పిలుపు మేరకు నిర్వహించిన బంద్ సంపూర్ణంగా జరిగింది. పది జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్‌ను విజయవంతం చేశారు. హైదరాబాద్‌లో సేవ్ఆంధ్రప్రదేశ్ పేరిట ఏపీఎన్జీవోలు సభ ఏర్పాటు చేయడం వల్ల నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఏపీఎన్జీవోలను ఎల్బీ స్టేడియం ప్రాంగణంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసినా.. నగరంలో మాత్రం వ్యాపార, వాణిజ్య విద్యాసంస్థలు స్వచ్ఛందంగానే మూసివేశారు. ఎల్బీ స్టేడియం పరిసరాలు మినహా మిగిలిన చోట్ల బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ బంద్‌కు మద్దతు ప్రకటించడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సీమాంధ్ర ప్రాంతం నుంచి ప్రత్యేక బస్సుల్లో ఏపీఎన్జీవోలు హైదరాబాద్‌కు వస్తుండగా..తెలంగాణ ప్రాంతంలో బస్సులపై అక్కడక్కడా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. ఖమ్మం జిల్లాలో శుక్రవారం రాత్రే పశ్చిమగోదావరి నుంచి వస్తున్న బస్సుపై , నల్లగొండ జిల్లా సూర్యాపేట, నగరంలోని కొత్తపేట, దిల్సుఖ్నగర్ ప్రాంతంలో సీమాంధ్ర ఉద్యోగుల బస్సులపై రాళ్లదాడులు కొనసాగాయి. కోదాడ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న జాతీయ రహదారి నెంబరు 5 పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినా తెలంగాణవాదులు ఆ ప్రాంతం గుండా వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. రోడ్లపై టైర్లను వేసి తగులబెట్టారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చే ప్రధాన రహదారిపై తెలంగాణవాదులు పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. కొత్తకోట చెక్‌పోస్టు వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుతో సహా పలువురిని అరెస్ట చేశారు. రాజీవ్‌రహదారిపై తెలంగాణవాదులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో బంద్ సంపూర్ణమైంది. ఎక్కడికక్కడే ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. జిల్లాలో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో బంద్ సంపూర్ణంగా ముగిసింది. వ్యాపార, వాణిజ్య, సినిమాహాళ్లు మూతపడ్డాయి. బస్సులు రోడ్లపైకి రాలేదు. కరీంనగర్ జిల్లాలో బంద్ పరిపూర్ణమైంది. తెలంగాణ ఉద్యమానికి పురిటి గడ్డ అయిన జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో విద్యార్థిలోకమంతా రోడ్లపైకి వచ్చి బంద్‌ను విజయవంతం చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు వరంగల్‌లో భారీర్యాలీ నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేసి ఫైళ్లను తగులబెట్టారు. జిల్లాలో న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్, బీజేపీ, జేఏసీ నాయకులు రోడ్లపైకి వచ్చి బంద్‌ను విజయవంతం చేశారు. మెదక్ జిల్లాలో బంద్ సంపూర్ణంగా ముగిసింది. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీమాంధ్ర ప్రాంతం నుండి హైదరాబాద్‌కు వచ్చే ప్రధాన రహదారి ఈ జిల్లా నుండే ఎక్కువ భాగం ఉండడంతో తెలంగాణవాదులు ఈ రహదారిని పూర్తిగా మూసివేసే ప్రయత్నం చేశారు. నల్లగొండ జిల్లాలో కూడా ఉద్రిక్తత పరిస్థితి మధ్య బంద్ కొనసాగింది. జాతీయ రహదారి 9పై తెలంగాణవాదులు భారీగా మోహరించారు. ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాయలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. తిరుపతి నుండి వచ్చే బస్సుపై విద్యార్థులు రాళ్లవర్షం కురిపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓయూ విద్యార్థులను ఎన్సీపీ గేట దగ్గర అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. నిజాంకళాశాల హాస్టల్లోకి పోలీసులు ప్రవేశించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణవ్యాప్తంగా న్యాయవాదులు కోర్టులను బహిష్కరించారు.