Wednesday, 4 November 2026

ఎల్బీస్టేడియానికి కట్టుదిట్టమైన భద్రత

8వేల మంది పోలీసుల మోహరింపు
9గేట్ల ద్వారా అనుమతి
హైదరాబాద్‌, సెప్టెంబరు7 : ఏపీఎన్జీవోలు శనివారం నిర్వహించిన సేవ్‌ఆంధ్ర ప్రదేశ్‌ సమైక్య గర్జనకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎల్బీస్టేడియాన్ని అష్టదిగ్బంధనం చేశారు. ఎస్పీస్థాయి అధికారులచే పర్యవేక్షణ నిర్వహించారు. లిబర్టీ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్‌ వైపు తరలించారు. కింగ్‌ కోఠి నుంచి వచ్చే వాహనాలను రామకోఠి మీదుగా, అబిడ్స్‌ నుంచి వచ్చే వాహనాలను నాంపల్లికి మీదుగా తరలించారు. పోలీస్‌ కంట్రోల్‌ మీదుగా ఉన్న రోడ్డును పూర్తిగా మూసివేశారు. సీఆర్పీఎఫ్‌, రాపిడ్‌యాక్షన్‌ ఫోర్స్‌ను సిద్ధం చేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు సభకు అనుమతి ఇచ్చినా ఉదయం నుండే ఎల్బీ స్టేడియంలోకి ఉద్యోగులు రావడం మొదలు పెట్టారు. శనివారం తెలంగాణ రాజకీయ జేఏసీ బంద్‌కు పిలుపునివ్వడంతో సీమాంధ్ర నుంచి వచ్చిన ఉద్యోగులు ఒకరోజు ముందే నగరశివార్లలో ఆశ్రయం పొందారు. ఎల్బీ స్టేడియానికి సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరాలనుకున్న అనుమతి ఇవ్వలేదు. గుర్తింపు కార్డులు చూపించిన తర్వాతే లోపలికి అనుమతించారు. ఎల్బీస్టేడియం చుట్టుపక్కల చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12గంటల వరకే ఉద్యోగులతో స్టేడియం నిండిపోయింది. సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు వ్యవహరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిలు ఈ సభ నిర్వహణల వెనుక ఉన్నారంటూ తెలంగాణవాదులు చేస్తున్న ఆరోపణలు నిజమనేలా పోలీసులు మరీ దగ్గరుండి ఉద్యోగులను ఎల్బీ స్టేడియానికి తీసుకువచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *