Tuesday, 3 November 2026

రవాణా వ్యవస్థ స్తంభన..ఇబ్బందుల్లో ప్రజలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 : తెలంగాణ బంద్‌ విజయవంతమైందని టిఎన్‌జివో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ అన్నారు. టిజెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ బంద్‌ సక్సెసయిందన్నారు. సీఎం, డీజీపీ వైఖరులను తెలంగాణ ప్రాంత ప్రజలు తూర్పారబడుతున్నారన్నారు. ఒకరికి అనుమతినిచ్చి.. మరొకరికి ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు.

స్తంభించిన రవాణా

తెలంగాణ బంద్‌తో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో అవస్థలు పడ్డారు. జంట నగరాల్లోని 3,800 సిటీబస్సులు వివిధ డిపోల్లో నిలిచిపోయాయి. దీంతో ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది ఇబ్బందిపడ్డారు. ఆటోలను ఆశ్రయించారు. ఆటోవాలాలు అయినకాడికి దండుకున్నారు. 2 కిలోమీటర్ల దూరానికి సైతం 10రూపాయలు చొప్పున కొందరు ఆటోవాలాలు వసూలు చేశారు. ఇదిలా ఉండగా మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 8డిపోల్లో 800 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. కార్మికులు సైతం విధులను బహిష్కరించారు. వరంగల్‌ జిల్లాలోని 8 డిపోల్లో 900 బస్సులు నిలిచాయి..  భూపాలపల్లిలోని సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యారు. అదేవిధంగా కరీంనగర్‌ జిల్లా రామగుండంలో ప్రాంతంలోని కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నల్గొండ జిల్లాలో 700 బస్సులు రోడ్డెక్కలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *