హైదరాబాద్, సెప్టెంబరు 15 : ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి(94) సోమవారం ఉదయం 8.:30గంటలకు కన్నుమూశారు. సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన పలు చిత్రాల ద్వారా తెలుగు సినీ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. సీఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో జీవనం గడుపుతున్న ఆయన చాలా కాలంగా అస్వస్థతతో ఉన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ తాలుకా చిన్నపాలపర్రు గ్రామంలో 1920 అక్టోబరు 4వ తేదీన జన్మించారు. అనంతరం హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తమ్మారెడ్డి భరద్వాజ సినీ నిర్మాతగా స్థిరపడ్డారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న శ్రీకృష్ణమూర్తి వామపక్ష ఉద్యమంలో పనిచేశారు. ప్రజానాట్య మండలి వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. 2007లో ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు కూడా వచ్చింది. సీపీఐతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. లక్షలాదికారి, జమీందారు, బంగారు గాజులు, చిన్ననాటి కలలు, ధర్మదాత, ఇద్దరు కొడుకులు, లవ్‌మ్యారేజ్ వంటి 13 సినిమాల్లో ఆయన నిర్మించారు. ఆయన మృతికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీరాఘవులు, సీపీఐ కార్యదర్శి కె.నారాయణ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబస సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన చండ్రరాజేశ్వరరావు ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యుడు.




